ఇటీవలే సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళలు తమపై జరిగిన లైంగిక దాడులపై క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ వివిధ ఉద్యమాల ద్వారా బహిర్గతం అయ్యారు. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సంచలన వార్త బయటికి వస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ చక్రవర్తి తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడంటూ ఒక యువతి కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకొని చివరకు మోసం చేశాడని మహాక్షయపై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తనతో నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అతని కారణంగా తాను గర్భం దాల్చడంతో అబార్షన్ కూడా చేయించి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని ఆమె తెలిపింది.


మహాక్షయపై కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన తల్లి యోగితా బాలి కూడా తనను బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మహాక్షయ, అతని తల్లిపై సెక్షన్ 376 (2) (ఎన్), 328, 417, 506, 313, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓషివారా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ దయానంద్ బంగర్ తెలిపారు. గతంలో కూడా మహాక్షయపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కొందరు అప్‌కమింగ్ హీరోయిన్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. రెండేండ్ల క్రితం 2018లో భోజ్‌పురి నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికదాడి, గర్భస్రావం చేసినట్లు మహాక్షయపై ఫిర్యాదులు వచ్చాయి. తిరిగి ఇప్పుడు అదే రకమైన ఫిర్యాదు నమోదుకావడంతో అతని తీరు జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: