పురాణ కాలంలో తండ్రి దశరథ మహారాజు మాటకి కట్టుబడి కన్నకొడుకు అయిన శ్రీరాముడు వనవాసం చేశాడని విన్నాం. ఆ తరువాత కాలంలో కొద్దిగా మార్పులు చెందుతూ కొన్నాళ్లకు తండ్రి మాట వినని పుత్రులను కూడా చూశాం. అయితే ఇప్పుడు ఒక పరమ సుంట సుపుత్రుడు మాత్రం ఏకంగా తన స్వలాభం కోసం ఉచ్ఛనీచాలు మరచి కన్నతండ్రినే హత్య చేశాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కారుణ్య మరణాల కోటాలో కన్నతండ్రి ఉద్యోగాన్ని పొందడానికి ఓ కొడుకు అత్యంత నీచానికి పాల్పడ్డాడు. ఏ కుమారుడూ చేయకూడని పని చేశాడు. తండ్రిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్ (Jharkand) రాష్ట్రంలోని రామ్‌గర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌గ‌ర్ జిల్లాలోని బ‌ర్కక‌నాలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌ (సీసీఎల్‌)లో కృష్ణా రామ్‌ (55) అనే వ్యక్తి కొన్నేళ్లుగా సెక్యురిటీ గార్డుగా ప‌ని చేస్తున్నారు. కాగా.. ఆయన గత గురువారం (నవంబర్ 19) వేకువజామున తన నివాసంలో విగతజీవిగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. గొంతు కోయ‌డంతో కృష్ణారామ్ మరణించిన‌ట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఇంట్లో ఓ చోట నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.


కృష్ణా రామ్ పెద్ద కుమారుడు రామ్ (35) ఉద్యోగం లేకుండా బలాదూర్‌గా తిరుగుతున్నాడు. కొన్ని ఉద్యోగాలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తండ్రి చనిపోతే ఆ ఉద్యోగం తనకొస్తుందని తెలుసుకున్న రామ్.. దారుణమైన కుట్ర పన్నాడు. తండ్రిని హతమార్చి ఎలాగైనా ఆ ఉద్యోగాన్ని దక్కించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో కృష్ణా రామ్ గత గురువారం రాత్రి ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న తండ్రిని గొంతు కోసి హత్య చేశాడు. కృష్ణా రామ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా తన నేరం అంగీకరించాడు. కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకే కన్నతండ్రిని హ‌త‌మార్చిన‌ట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ప్రకాశ్ చంద్ర మహతో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: