రాను రాను సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి.  పొరుగు సంబంధాల గురించి దేవుడెరుగు..‌ రక్త సంబంధాలే రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతున్నాయి. బంధాల కంటే డబ్బుపైనే ప్రేమ పెంచుకుంటున్నారు. అది ఎంతలా అంటే పదవి కోసం, డబ్బు కోసం ఏకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హతమార్చేంతటి దారుణమైన ఘోరానికి పాల్పడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే..‌ రైతు బీమా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయల కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కన్నతండ్రినే కిరాతకంగా చంపేశాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెం గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం గ్రామానికి చెందిన చింతల రుస్తుం అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రుస్తుంకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కుమారులు శేఖర్ (25), సురేశ్ (20) పేరిట ఒక్కో ఎకరి రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగిలిన ఎకరా భూమిని తన పేరు మీదే ఉంచుకున్నాడు. తండ్రీ, ఇద్దరు కుమారులు రైతు బంధు, రైతు బీమా పథకాలకు లబ్ధిదారులుగా ఉన్నారు.


రుస్తుం పెద్ద కుమారుడు శేఖర్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దారుణ కుట్రకు పథక రచన చేశాడు. తన తండ్రి చనిపోతే రైతు బీమా కింద రూ.5 లక్షలు వస్తాయని భావించాడు. ఈ క్రమంలో కన్నతండ్రినే కడతేర్చాలనుకున్నాడు. ఆదివారం (నవంబర్ 22) మధ్యాహ్నం రుస్తుం కుటుంబసభ్యులందరూ పొలం వద్ద విందు చేసుకున్నారు. మద్యం సేవించారు. తాగిన మత్తులో రుస్తుం ఆ రాత్రి పొలం వద్దే నిద్రించాడు. ఇదే అదనుగా భావించిన శేఖర్ నిద్రిస్తున్న తండ్రి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కపట నాటకానికి తెరతీశాడు. అంతవరకు సరాదాగా గడిపిన రుస్తుం తెల్లారేసరికి విగతజీవిగా మారడంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. శేఖర్ ప్రవర్తనా తీరులో అనుమానం రావడంతో అతడిని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో రుస్తుంను తానే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతడిని పట్టించారు. బాధితుడి చిన్న కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: