చట్ట ప్రకారం మన దేశంలో ఒక వ్యక్తి ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. కానీ కొంతమంది మాత్రం చట్టం కళ్లుకప్పి రెండు, మూడు పెళ్లళ్లు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఓ ప్రబుద్ధుడి ఉదంతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

వెంకట బాలకృష్ణ పవన్ కుమార్ అనే వ్యక్తితో హిమబిందుకు ఓ మాట్రిమోనీ సైట్‌లో పరిచయమైంది. పవన్‌కు దుబాయ్‌లో ఉద్యోగం. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిరుచులూ కలవడంతో వివాహం చేసుకోవాలనుకున్నారు. దీంతో పెద్దల సమక్షంలో 2018లో పెళ్లి చేసుకున్నారు. భారీ మొత్తంలో కట్న కానుకలు కూడా పవన్‌కు అందాయి. తమ బిడ్డను అల్లారుముద్దుగా చూసుకున్నామని, కష్టపెట్టకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు పవన్‌ను కోరారు. పవన్ కూడా సరేనంటూ ఆమెను కాపురానికి తీసుకెళ్లాడు. అయితే పవన్ మేకవన్నె పులి అన్న విషయం వారికి అప్పటికి తెలియదు.

దుబాయ్ చేరుకున్న కొద్ది రోజులకే బాధితురాలికి అసలు విషయం తెలిసింది. అదేంటంటే పవన్‌కు గతంలోనే  వివాహమైంది. అది కూడా ఒకరిద్దరితో కాదు.. ఏకంగా ముగ్గురితో వివాహమైంది. మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆమె నిలదీయడంతో పవన్‌లోని దుర్మార్గుడు బయటకొచ్చాడు. ఆమెను చంపేయడానికి కూడా అనేకసార్లు ప్రయత్నించాడు. విచిత్రం ఏంటంటే పవన్ తల్లిదండ్రులకు కూడా వారి కొడుకు పెళ్లిళ్ల విషయం తెలుసు. ఈ కేసుకు సంబంధించి బాధిత మహిళ గతేడాది మహిళా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ, అత్తా, మామాలు తనపై ఒత్తిడి చేస్తున్నారని, కేసు వదులుకోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పవన్ అతని స్నేహితులు.. తన ఈ మెయిల్, ఫోన్ హ్యాక్ చేసి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నాకు జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగకూడదు. పవన్‌పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయండి’ అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్, మహిళా పోలీసులను హిమబిందు ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: