ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు 22 ఏళ్లు. చూడడానికి అందంగా లవర్ బాయ్‌లా ఉంటాడు. ఫేస్‌బుక్‌లో యమా యాక్టివ్‌గా ఉంటాడు. అక్కడే ఓ అమ్మాయితో అతడికి
పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. చక్కగా కాపురం పెట్టారు. అయితే కొన్నాళ్లకు
ఆమెకు అసలు విషయం తెలిసి షాక్ అయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన గణే‌శ్‌ అనే యువకుడికి ఫేస్‌బుక్‌లో లవ్లీ
గణేశ్ పేరుతో ఓ ఖాతా ఉంది. ఆ ఖాతా ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకుని తనను ప్రేమిస్తునని చెప్పి పెళ్లికి ఒప్పించాడు. ఆమె కూడా అందుకు ఒప్పుకుంది.

విషయం ఇంట్లో తెలియడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. పెళ్లికి తాము ఒప్పుకోమని బెదిరించారు. దీంతో అమ్మాయి ఇంట్లోనుంచి వెళ్లిపోయి అతడిని చేరుకుంది. ఇద్దరూ మేజర్లు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత గణేశ్‌ ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది. అతడి గురించి ఆరా తీయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఓ షాకింగ్ నిజం తెలిసింది. అతడి నిజ స్వరూపం బయటపడింది. అతడికి తనకంటే ముందు 11 మందితో వివాహమైందని తెలిసి ఆ యువతి షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే గణేశ్‌ను అదుపులోనికి తీసుకున్నారు. అతడి ఇంతకుముందు ఎవరెవరిని ఈ విధంగా మోసం చేశాడు..? వారెక్కడున్నారు..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధంగా ఆన్‌లైన్‌లో పరిచయం అయినవారితో ప్రేమలో పడడం, ఆ తరువాత మోసపోవడం వంటి సంఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయని, యువతుల్లో ఇలాంటి మోసాలపై అవగాహన పెరగాలని పోలీసులు అన్నారు. లేకపోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: