జల్సాలకు అలవాటు పడిన ఓ భర్త తన భార్య అడిగినన్ని డబ్బులు ఇవ్వడం లేదని గొంతు కోసి.. కడుపులో పొడిచి అతిదారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు ఈ విధంగా చెబుతున్నారు.. కృష్ణా  జిల్లా ముస్తాబాద్ సావరగూడేనికి చెందిన రత్నాకరరావుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయనపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి(31)కి  పదేండ్ల కిందట పెళ్లైంది. వీరికి ప్రస్తుతం తొమ్మిదేండ్ల కూతురు కూడా ఉంది. కాగా వరలక్ష్మి భర్త రత్నాకరరావు రెండేండ్ల కిందట చనిపోయాడు. దాంతో వరలక్ష్మికి తన పెద్దమ్మ తాడేపల్లిగూడెం మండలం తండగర్రకు చెందిన శ్రీను అనే వ్యక్తితో ఏడాదిన్నర కిందట పెళ్లి జరిపించింది.

కాగా శ్రీనుకు ఇది రెండో వివాహం. తన మొదటి భార్య అతన్ని ఉపాది నిమిత్తం వదిలేసి వెళ్లింది. ప్రస్తుతం శ్రీను ఉల్లిపాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. అయితే వరలక్ష్మిని పెళ్లిచేసుకున్న శ్రీను.. వరలక్ష్మి బ్యాంకులో తన కూతురు పేరుమీదున్న రూ. 5 లక్షలను తీసుకురావాలని తరచూ గొడవకు దిగేవాడు. శ్రీను నుంచి వస్తున్న వేధింపులను తట్టుకోలేక వరలక్ష్మి రూ. 4 లక్షలను తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది. భార్య ఇచ్చిన ఆ నాలుగు లక్షలను  శ్రీను జల్సాలకు ఉపయోగించాడు. కూతురు భవిష్యత్తు కోసం దాచి పెట్టిన సొమ్మును  తీసుకుని ఏ ఆధారం లేకుండా చేశాడని వరలక్ష్మి ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. దాంతో గ్రామ పెద్దలు శ్రీనుని మందలించి.. లక్ష రూపాయలన్నా కూతురి బ్యాంకు ఖాతాలో వెయ్యాలని తెలియజేసారు.

అప్పుడు అంగీకరించిన శ్రీను ఆ సొమ్మును కూతురు ఖాతాలో వెయ్యలేదు సరికదా.. రోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడే. దాంతో పది రోజుల కిందట వరలక్ష్మి దువ్వ వయ్యేరు కాలువ సమీపంలో ఉంటున్న తన పెద్దమ్మ ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది. అయితే గురువారం రోజున శ్రీను తన భార్యతో ఫోనులో మాట్లాడాడు. వరలక్ష్మి తన పెద్దమ ఇంటి వద్దే ఉందన్న విషయం తెలుసుకున్న శ్రీను అక్కడకు వచ్చి కత్తితో ఆమె గొంతు కోసి, కడుపులో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అది చూసిన స్థానికులు ఆమెను కాపాడేందుకు 108 కాల్ చేశారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్టు 108 సిబ్బంది తెలిపారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు శ్రీను పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: