గోరఖ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అభ్యంతరకర  పోస్టులు పెట్టిన లా స్టూడెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అనేక ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. చౌరి చౌరా ప్రాంతంలోని పండిట్ పురా గ్రామంలో నివశిస్తున్న ఎల్ఎల్‌బీ ప్రథమ సంవత్సరం విద్యార్థి అరుణ్ యాదవ్ సోషల్ మీడియాలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగిలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టాడు. అయితే ఆ పోస్టులపై విమర్శలు రావడంతో కొద్ది సేపటికి వాటిని తొలగించేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.

యూపీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో అరుణ్ యాదవ్ అనే యువకుడు న్యాయ విద్య అభ్యసిస్తున్నాడు. అయితే సోమవారం అతడు తన సోషల్ మీడియాలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లపై అభ్యంతరకరమైన పోస్టులు చేశాడు. దీంతో అనేకమంది అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూపీ పోలీసులు అరుణ్‌ను అరెస్టు చేశారు.

అరుణ్ అరెస్టు కావడంతో అతడిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయ అధికారులు కూడా అతడిని యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. విద్యార్థి సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై వర్శిటీ క్రమశిక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. విచారణకు హాజరు కావాలని విద్యార్థికి యూనివర్శిటీ అధికారులు నోటీసు కూడా పంపించారు.

ఇదిలా ఉంటే అరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 153ఏ, 469, ఐటీ యాక్ట్ 66ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై సీనియర్ పోలీసు అధికారి సుమిత్ శుక్లా  వివరాలను వెల్లడించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం ఐటీ విభాగం విద్యార్థి పెట్టిన అభ్యంతరకరమైన పోస్టును రికార్డు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: