పంజాగుట్ట: దారుణం.. కట్టుకున్న భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే పథకం వేసి మరీ హత మార్చింది ఓ భార్య. ఆ నేరం నుంచి తప్పించుకోవాలని భర్తది సహజ మరణమని నాటకమాడి తెలివిగా తప్పించుకుందామనుకుంది. కానీ పోలీసుల ముందు ఆమె నాటకమంతా బట్టబయలైంది. ఇంకేముంది భర్త హత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేశారు పంజాగుట్ట పోలీసులు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ జా  ఇతని భార్య కుష్బుదేవి(32) ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి నివాసం ఉంటున్నారు. వీరు ఖైరతాబాద్ ఎంఎస్ మక్తా రాజ్ నగర్ లో తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. కాగా లక్ష్మణ్ జా సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  అయితే ఈ  దంపతులు ఖైరతాబాద్ లో 2019 లో జ్యూస్ పాయింట్ ను మొదలుపెట్టారు. దానిలో పనిచేసేందుకు లాల్ బాబు(35) అనే  వారి బంధువును జ్యూస్ పాయింట్ లో నియమించారు.

ఈ క్రమంలోనే కుష్బుదేవికి లాల్ బాబుకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఆరునెలల కిందట లాల్ బాబు భార్య మరణించడంతో  అతను జ్యూస్ పాయింట్ కు రాలేకపోయాడు. దాంతో లక్ష్మణ్ జా అతన్ని దాన్నుంచి తొలగించాడు. దాంతో లాల్ బాబు ప్రస్తుతం ఓ హోటల్ లో పని చూసుకున్నాడు. కానీ కుష్బుదేవితో మాత్రం వారి సన్నిహిత్యాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉండేవాడు. ఈ విషయం లక్ష్మణ్ జా  కి తెలియడంతో వారిద్దరిని మందలించాడు. కానీ కుష్బుదేవి మాత్రం తన ప్రవర్తనను మార్చుకోలేకపోయింది. పైగా తన వివాహేత సంబంధానికి భర్తే అడ్డుగా ఉన్నాడని భావించింది.  అందుకే పక్కా ప్లాన్ వేసి భర్తను చంపాలనుకుంది. అనుకున్న ప్రకారమే ఈ నెల 14న కుష్బుదేవి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని భర్త చావుకు స్కెచ్ వేసింది.

అర్థరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న భర్త చాతిపై కూర్చుని అతని మెడకు చున్నీని గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు తనకేమీ తెలియదన్నట్టు మరుసటి రోజు ఉదయం తన భర్త తమ్ముడికి ఫోన్ చేసి సహజంగా చనిపోయాడంటూ అతనితో చెప్పింది. కానీ సోదరుడి మరణంపై అనుమానంతో అతను పంజాగుట్ట పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశాడు. అనుకున్నట్టుగానే పోస్టుమార్టం రిపోర్టులో అది సహజ మరణం కాదని.. ఇది ఖచ్చితంగా ఊపిరి ఆడకుండా చేసి చంపారని వెళ్లడించారు డాక్టర్లు. దాంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: