ఇంటర్నెట్ డెస్క్:  జీవితంలో ఉన్న సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు అనేక మార్గాల గురించి ఆలోచించాడు. చిరవకు రైలు కింద పడి ప్రాణాలు తీసుకుందామని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా దగ్గరలోని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లారు. పట్టాలపై పడుకుని రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చారో కొందరు పోలీసులు వచ్చి అతడిని కాపాడి స్టేషన్‌కు తరలించారు. అసలు పోలీసులకు తన విషయం ఎలా తెలిసింది..? ఉన్నట్లుండి వారెలా వచ్చారని యువకుడు ఆశ్చర్యపోయాడు. అయితే తమకు ఎవరో అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చాడని, అందువల్లే తాము  అతడిని కాపాడగలిగామని పోలీసులు చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని భువనగిరి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వెంటనే 100కి కాల్ చేసి ఎవరో యువకుడు ఆత్మహత్య చేసుకొనేందుకు పట్టాలపై పడుకున్నాడని సమాచారమిచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన డయల్ 100 సిబ్బంది ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పట్టాలపై యువకుడిని గుర్తించి రైలు రాకముందే అతడిని అక్కడ నుంచి తీసుకెళ్లారు. పోలీసులను ఊహించని ఆ యువకుడు మొదట షాక్ తిన్నాడు. అయినా తాను రానని పట్టుబట్టడంతో పోలీసులు అతడిని బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చారు.

అనంతరం భువనగిరి స్టేషన్‌లో యువకుడికి కౌన్సిలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోసారి ఇలాంటి పని చేస్తే ఊరుకునేది లేదని పోలీసులు అతడిని హెచ్చరించారు. అతడిపై దృష్టి పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలని, ఒంటరిగా వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సూచించారు. అయితే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొనే తమ బిడ్డ ఇలా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడాన్ని నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: