హైదరాబాద్: ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల కొందరు ఆర్ధికంగా నష్టపోతుంటే మరికొందరు మరింత దారుణంగా మోసపోతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ బాలిక ఇలాంటి దారుణానికే గురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడిని నమ్మి వచ్చినందుకు ఆ బాలిక దారుణంగా మోసపోయింది. ఆ యువకుడే ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.


హన్మకొండ సీఐ వై చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన బాలికపై అత్యాచారం కేసులో హన్మకొండకు చెందిన నూనె మురళీకృష్ణ అనే వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం అతడిని మంగళవారం జైలుకు తరలించారు. 


హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన నూనె మురళీకృష్ణ డిగ్రీ పూర్తి చేశాడు. కానీ జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. రెండు నెలల కిందట ఆ బాలికను మురళీకృష్ణ హన్మకొండకు పిలిపించాడు. ఆమె అతడిని నమ్మి ఢిల్లీ నుంచి హన్మకొండకు వచ్చింది. అలా వచ్చిన ఆ బాలికను మురళీ కృష్ణ తన గదిలో బంధించాడు. 


వారం రోజుల పాటు బలవంతంగా అత్యాచారం చేశాడు.

అయితే ఆ బాలిక ఇంటి నుంచి బయలుదేరి సమయంలో ఇంట్లో చెప్పకపోవడం, రెండో రోజుకు కూడా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక రాణిగంజ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఫోన్‌కు హన్మకొండలో ఉంటున్న మురళీకృష్ణ ఫోన్‌ నుంచి తరుచుగా ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు వారి దర్యాప్తులో తేలింది. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసును హన్మకొండ పీఎస్ కు మార్చారు. 


బాలిక తల్లిదండ్రులు కూడా ఈ నెల 14న హన్మకొండకు వచ్చి ఇక్కడి పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉంటే పోలీసులు పట్టుకుంటారని గమనించిన మురళీకృష్ణ.. బాలికను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాడు.


ప్రత్యేక పోలీసు బృందాలు వారిపై నిఘా ఉంచడంతో చివరకు తమిళనాడులోని మధురైలో మురళీకృషను పట్టుకుని మంగళవారం హన్మకొండకు తీసుకువచ్చారు. మురళీకృష్ణను విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్టు సీఐ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: