ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు మొబైల్ అంటే తెలియదు. కానీ తర్వాత నెట్‌వర్క్ మొబైల్స్ వచ్చాయి. అదే విచిత్రమనుకుంటే ఇంటర్నెట్ వచ్చి మానవ జీవితాన్నే మార్చేసింది. 2జీ, 3జీ, 4జీ అంటూ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో మనముందుకు తీసుకొస్తోంది. అయితే ఎక్కువ సమాచారాన్ని, వీడియోలను అప్‌లోడ్ చేయాలన్నా, డౌన్‌లోడ్ చేయాలన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది.

ఉరుకుల పరుగుల మీద సాగే మానవ జీవితంలో ఈ ఆలస్యం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుకే టెక్ సంస్థలు ఇప్పుడు 5జీపై దృష్టి సారించాయి. ఎంత పెద్ద వీడియోనైనా, గిగాబైట్ల సైజులో ఉన్నా క్షణాల్లో అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేసుకునేలా ఈ టెక్నాలజీ ఉండబోతోంది. అయితే ఇతర దేశాల్లో ఇప్పటికే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా భారత్‌లో మాత్రం అడుగుపెట్టలేదు. ఈ క్రమంలోనే మన దేశంలోకి కూడా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికం సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఇటీవలే జియో సంస్థ 5జీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పుడు మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా 5జీపై దృష్టి సారించింది. ఈ మేరకు మంగళవారం ఎయిర్‌టెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లోకి 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు అమెరికన్ టెక్ సంస్థ క్వాల్‌కమ్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఎయిర్‌టెల్ ఆ ప్రకటనలో తెలిపింది.

దీనికోసం క్వాల్‌కమ్‌కు చెందిన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(ర్యాన్) ప్లాట్‌ఫాంలను వినియోగించనుంది. దీని ద్వారా వర్చువల్‌గా ఓపెన్ ర్యాన్ బేస్డ్ 5జీ నెట్‌వర్క్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక దీనికోసం వినియోగించనున్న 0-ర్యాన్ ఫ్లాట్‌ఫాంలలో ఉండే ఆర్కిటెక్చర్, ఫ్లెక్సిబులిటీ 5జీ నెట్‌వర్క్ ఏర్పాటులో ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించేందుకు అవకాశాలు కల్పిస్తుందని ఎయిర్‌టెల్ వెల్లడిచింది.

ఇదిలా ఉంటే భారత్‌లో తొలిసారి 5జీని పరీక్షించిన టెలికం సంస్థగా ఎయిర్‌టెల్ సంస్థ ఈ మధ్యనే రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో ఓ లైవ్ అడ్వర్టైజ్‌మెంట్‌ను 5జీ ద్వారా ప్రసారం చేసి విజయం సాధించింది. ఈ విజయంతోనే క్వాల్‌కమ్ సాయంతో 5జీ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. దీని కోసం 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్(ఎఫ్‌డబ్ల్యూఏ) ద్వారా గిగాబైట్ స్పీడ్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించేందుకూ ప్రణాళికలు రచిస్తోంది. అది కూడా అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

దీనిపై క్వాల్‌కమ్ యాజమాన్యం మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉందని, తమ కలయికతో 5జీ సేవల కల్పన మరింత సులభతరం అవుతుందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: