ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశం. అలాంటి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేయబడిన అత్యున్న వ్యవస్థ న్యాయవస్థ. కానీ తప్పును తప్పు అని చెప్పేందుకు న్యాయవవ్యస్థే భయపడితే..? దోషికి శిక్ష వేసేందుకు న్యాయవ్యవస్థే భయపడితే..? మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఓ హత్య కేసులో తీర్పు ఇచ్చేందుకు సదరు జడ్జి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని, నిందితులతో చేతులు కలిపిన పోలీసులు తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.

కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా గతేడాది హత్యకు గురయ్యారు. ఈ కేసుపై దామోహ్ జిల్లాలోని హట్టా అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.  ఈ కేసును న్యాయమూర్తి(ఏడీజే-2) ఆర్‌పీ సోన్‌కర్ విచారిస్తున్నారు. ఈ నెల 8న కూడా విచారణ జరిగింది. అయితే నిందితులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ జారీ చేసిన అరెస్టు వారంట్ అమలులో పోలీసులు పాటించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పోలీసుల తీసుకున్న చర్యలపై స్టేట్‌మెంట్‌ను ఆర్‌పీ సోన్‌కర్ రికార్డు చేశారు. అందులో పోలీసులు తగిన విధానాన్ని పాటించలేదని జడ్జి సోన్‌కర్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తనపై పోలీసుల ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనను అపఖ్యాతిపాలు చేయడానికి పోలీసులు నిందితులతో కలిసి కుట్ర పన్నుతున్నట్లు తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ ఆయన సబార్డినేట్లతో కుమ్మక్కయి తనపై తీవ్రమైన నేరారోపణలను మోపే అవకాశం ఉందని రాసుకొచ్చారు. తనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఇతర పోలీసులు మితిమీరిన ఒత్తిడి తెస్తున్నారని, తనకు జరగరానిదేమైనా జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఈ మేరకు ఇటీవల ఓ ఆర్డర్‌ రాసి విడుదల చేశారు. అంతేకాకుండా ఈ హత్య కేసు విచారణను వేరొక న్యాయస్థానానికి బదిలీ చేయాలని దామోహ్ జిల్లా, సెషన్ జడ్జికి లేఖ రాశారు.

ఇదిలా ఉంటే మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. ఆయన బీఎస్‌పీని వదిలిపెట్టి, కాంగ్రెస్‌లో చేరినందుకే ఆయనను నిందితులు హతమార్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో బీఎస్‌పీ ఎమ్మెల్యే రాంబాయ్ ఠాకూర్ భర్త గోవింద్ సింగ్, వారి సన్నిహిత బంధువులు నిందితులుగా ఉన్నారు. గోవింద్ సింగ్‌ పలుకుబడిగల రాజకీయ నేత. ఆయనపై ఇప్పటి వరకు 28 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మూడు హత్య కేసుల్లో జీవిత ఖైదు పడింది. వీటన్నిటిలోనూ ఆయన బెయిలుపై విడుదలై బయట తిరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: