దొంగల భీభత్సానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇష్టమొచ్చిన చోట డబ్బుున్న వాళ్లనే ఎరగా చేసుకుని రాబరీలకు పాల్పడుతున్నారు. ఎంతో మంది ఇండ్లల్లో లక్షలు లూటీ చేసేసి పరారవుతున్నారు. అందుకే దొంగల ఆట కట్టించేందు పోలీసు వ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. అయితే ఓ దొంగల ముఠా తెలంగాణాలో భారీ చోరీకి పాల్పడి.. ఆంధ్రప్రదేశ్ లో అడ్డంగా దొరికిపోయారు పాపం. కాగా ఈ దొంగల నుంచి పోలీసులు 35 లక్షల రూపాయలను, బంగారు ఆభరణాలతో పాటుగా వెండి నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పోలీసులు నేడు (ఆదివారం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో, కృష్ణా జిల్లాలోని జొన్నల గడ్డ చెక్ పోస్టు దగ్గర తనిఖీలు జరుపుతున్నారు.
కాగా ఆ సమయంలోనే మధిర నుంచి నందిగామ సైడు వెళుతున్న కారుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో ఆ కారును తనిఖీ చేశారు. కాగా ఆ తనిఖీలో పోలీసులు విస్తుపోయే విధంగా భారీ మొత్తంలో డబ్బులు, బంగారు, వెండి బయటపడ్డాయి. దాంతో ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి మొత్తంగా రూ. 35,61,650 లక్షలను, వెండి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఇంత భారీ మొత్తంలో డబ్బులు, నగలు దొరకడంతో పోలీసులు తమ స్టైల్లో విచారణ చేపట్టారు. ఇంత మొత్తంలో డబ్బులను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు.. ఈ డబ్బులతో మీరు ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించగా.. నిందుతులు అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఈ ఇద్దరు దొంగలు ఈ నెల 26న తెలంగాణాలోని వైరాలో ద్వారరానగర్ లో ఓ ఇంట్లో చొరబడి మొత్తం దోచుకొచ్చినట్టు నిందితులు పోలీసులకు వెళ్లడించారు. ఆ డబ్బులతో పారిపోయి ఇలా వచ్చినట్టు నిందితులు తెలిపారు. పట్టుబడిన ఈ ఇద్దరు దొంగలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఇక వీరిద్దరిని సోమవారం నాడు పోలీసులు కోర్టులో ప్రవేశపెడతారు. అయితే ఈ ఇద్దరు దొంగలు రాజస్థాన్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకరు దినేష్ సింగ్, మరొకరు ఇన్సాఫ్ మహమ్మద్ గా పోలీసులు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: