అత్యాచారం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న ఒక నిందితుడికి భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. బాధితురాలిని వివాహం చేసుకుంటామంటే సాయం చేస్తాం.. కాదంటే ఉద్యోగం పోగొట్టుకొని జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.. మైనార్ బాలిక‌ను ఆక‌ర్షించి అత్యాచారానికి పాల్ప‌డ్డావంటూ ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది.బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోప‌ణ‌లెదుర్కొంటున్న మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కంపెనీ టెక్నీషియన్ మోహిత్ సుభాష్ చవాన్‌కు అక్క‌డి హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నిందితుడికి ఓ అవకాశం ఇచ్చింది. బాధితురాలిని వివాహం చేసుకుంటే మేం సహాయం చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆ బాలిక‌ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి కోరింది.. కానీ అందుకు ఆ బాలిక నిరాకరించినట్లు సమాచారం. 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసుకుంటానని సుభాష్ చ‌వాన్ లిఖితపూర్వకంగా రాసిచ్చాడు..  ‘మీరు ఆమెను వివాహం చేసుకుంటారా?’ అని ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే ప్రశ్నించారు. దీనికి చవాన్ లాయర్ బదులిస్తూ.. సూచనలు తీసుకుంటామని తెలిపారు. ‘యువతిని మోహించి, అత్యాచారం చేసే ముందు మీరు ఆలోచించి ఉండాలి.. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని మీకు తెలుసు’ అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ‘పెళ్లి చేసుకోమని మేం బలవంతం చేయడంలేదు... మీకు ఇష్టమైతే మాకు తెలియజేయండి... లేకపోతే ఆమెను వివాహం చేసుకోమని బలవంతం చేస్తున్నామని మీరు చెబుతారు’  అన్నారు. దీంతో తన క్లయింట్‌ను సంప్రదించిన తర్వాత సమాధానం ఇస్తామని నిందితుడి తరఫు లాయర్ తెలిపారు.

వాస్తవానికి ఆమెను నేను పెళ్లి చేసుకోవాలని భావించాను కానీ, ఆమె నిరాకరించింది.. ప్రస్తుతం నాకు వివాహమైంది కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదు అని చవాన్ కోర్టుకు తెలియజేశారు. విచారణ కొనసాగుతోందని, ఛార్జ్‌షీట్ ఇంకా దాఖలు చేయలేదని తెలిపాడు. ‘నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి ఒక వేళ అరెస్టయితే అటోమేటిక్‌గా విధుల నుంచి సస్పెండ‌వుతాను’  అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘అందుకే మేము మీకు ఈ అవకాశం ఇచ్చాం.. అరెస్టుపై నాలుగు వారాల పాటు స్టే విధిస్తాం.. అప్పుడు మీరు సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని పేర్కొంది. ట్రయల్ కోర్టు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీచేయగా.. హైకోర్టు దానిని రద్దుచేసింది. తాజాగా, సుప్రీంకోర్టు అతడికి ఊరట కలిగించింది.. నాలుగు వారాల పాటు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. తర్వాత సాధారణ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: