మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, అఘాయిత్యాలు, నేరాలతో ఆ రాష్ట్రం నిత్యం వార్త‌ల్లోనే ఉంటుంది. అయినా అక్క‌డి ప్ర‌భుత్వాలు స్పందించ‌వు. త‌మ‌దికాన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. అదేమంటే క‌ర్మ సిద్ధాంతాన్ని వ‌ల్లె వేస్తుంటారు పాల‌కులు. స‌మ‌స్య ఎక్క‌డుందో, దాని మూల‌మేంటో క‌నుగొని ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త పాల‌కుల‌పై ఉంటుంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ బాధ్య‌త నుంచి త‌ప్పించుకోజూస్తున్నారు.

హత్రాస్ అత్యాచార ఘటన మరవకముందే... అదే హత్రాస్‌లో అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడే కాల్చి చంపిన ఘటన ప్రస్తుతం దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఓవైపు దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే మరోవైపు ఇదే  అలీఘడ్ జిల్లాలో మరో దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు(16) అక్రాబాద్ అనే గ్రామంలో నివసిస్తోంది. 28వ తేదీ ఉద‌యం 11.00 గంటల సమయంలో ఆమె పశుగ్రాసం కోసం ఇంటి నుంచి పొలానికి వెళ్లింది. అయితే సాయంత్రమైనా ఆమె ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా  గాలించ‌గా సమీపంలోని ఓ పంట పొలంలో ఆ బాలిక‌ శవమై కనిపించింది.

ప్రాథమిక విచారణలో బాలికను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలిందని స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెపై అత్యాచారం కూడా జరిగిందని ఆరోపిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు వెళ్లగా... గ్రామస్తులు వారిపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ ఇన్‌స్పెక్టర్‌కి గాల‌య్యాయి. అనుమానితులను త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుని విచారిస్తామని,  పోస్టుమార్టమ్ నివేదిక వస్తేకానీ బాలికపై అత్యాచారం గురించి  ఏమీ చెప్ప‌లేమ‌ని పోలీసులు చెప్పారు. కొద్దిరోజుల క్రితం యూపీలోని ఉన్నావ్‌లో ఇద్దరు దళిత బాలికలను ఓ యువకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే. మంచినీళ్ల సీసాలో విషం కలిపి ఇవ్వడంతో ఆ నీటిని తాగిన ముగ్గురు బాలికల్లో ఇద్దరు మృతి చెందారు. ఆ ముగ్గురిలో ఒకరిని ఇష్టపడ్డ ఆ యువకుడు... తన ప్రేమను ఆమె తిరస్కరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్ర‌తిరోజు నేరాల‌కు, హ‌త్య‌ల‌కు, అత్యాచారాల‌కు అడ్డాగా మారిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పై కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని మ‌హిళా సంఘాలు కోరుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: