కరోనా టైంలో మోసాలు పెరిగిపోతున్నాయి. నకిలీ వస్తువుల విక్రయాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యులకు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కరోనా రోగులకు వేసే ఇంజక్షన్ల దగ్గరి నుంచి వాడే శానిటైజర్ల వరకూ నకిలీ వస్తువులు మార్కెట్లో విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. ఒక్కొక్కటిగా ఇటువంటి మోసాలు బయటపడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కరోనాను ఆసరాగా చేసుకుని నకిలీ శానిటైజర్లు విక్రయిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.5లక్షల విలువగల నకిలీ శానిటైజర్లు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ పరిధిలోని మధుబన్‌కాలనీలో ఓ ఇంట్లో శ్రీ భూవి ప్రొడక్ట్‌ పేరుతో ఎస్‌.సుబ్రమణ్యం, బి.శ్రీనివాస్‌, కె.సుస్మిత నకిలీ శానిటైజర్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

అక్కడి నుంచి రూ.5లక్షల విలువగల నకిలీ శానిటైజర్లు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరు కొవిడ్‌ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని శానిటైజర్‌ విక్రయాలపై దృష్టి పెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రముఖ బ్రాండ్ల పేరుతో స్టిక్కర్లు, బ్యాచ్‌ నంబర్లు గోదాములో బాటిళ్లకు అతికించి అందులో నకిలీ శానిటైజర్‌ను నింపి నగరంలోని దుకాణాలకు విక్రయిస్తున్నారు. లీటరు రూ.100 చొప్పున క్యాన్లలో విక్రయించడంతో పాటు చిన్న స్ప్రే బాటిల్స్‌ హోల్‌సేల్‌ ధరలకు ఫ్యాన్సీ, మందుల దుకాణాలకు విక్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమంది నకిలీ శానిటైజర్ల తయారీదారుల వివరాలపై కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. కరోనా టైంలో ఇటువంటి మోసాలు వెలుగు చూడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: