కేరళ కు చెందిన ట్రాన్స్ జెండర్ లింగ మార్పిడి కోసం ఆరు సర్జరీలు చేసుకోగా అవి వికటించడంతో ఆత్మహత్య చేసుకుంది. ట్రాన్స్ జెండర్ అనన్య కుమారి అలెక్స్ కేరళ లోనే తొలి ట్రాన్స్ జెండర్ రేడియో జాకీగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మొదటి ట్రాన్స్ జెండర్ గా కూడా అనన్య ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా మంగళవారం కేర‌ళ‌లోని తన నివాసంలో అనన్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇంకా ఆమె మృతికి గల కారణాలు తెలియదు. కానీ అనన్య కుమారి గత ఏడాది కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతుందని చెబుతున్నారు. గత సంవత్సరం జూన్ నెలలో అనన్య లింగ మార్పిడికోసం ఆరు సర్జరీలు చేసుకున్నారు. 

ఆ తర్వాత తనకు సర్జరీ అనంతరం పలు ఆరోగ్య అనారోగ్య సమస్యలు వచ్చాయని ఆరోపించారు. ఆసుపత్రి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అన‌న్య కుమారి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీ జరిగి ఏడాది కావస్తున్నా తన ఆరోగ్యం ఇంకా కుదుట పడడం లేదని దారుణమైన బాధ కలుగుతుందని ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల‌నే ఇప్పటికీ తాను కోలుకోలేక పోతున్నానని తనకు న్యాయం చేయాలని అని డిమాండ్ చేశారు. ఇక తాజాగా అన‌న్య కుమారి మృతి పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇదిలా ఉండ‌గా అన‌న్య కుమారి కేర‌ళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనన్య డెమోక్రాటిక్ సోషల్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా ఇండియన్ ముస్లిం లీగ్ అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్ వేశారు. అయితే పోలింగ్ కు ఒకరోజు ముందు తన ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. అంతేకాకుండా తనకు బెదిరింపులు వస్తున్నాయని... ముఖ్యంగా సొంత పార్టీ నాయకులు త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ప్ర‌క‌టించారు. ఆ తర్వాత తమ పార్టీకి ఎవరూ ఓటు వేయవద్దని బహిరంగంగానే ప్రకటించి వార్తల్లో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: