రానురాను మానవత్వం మంటక‌లిసి పోతోంది. పసి పిల్లలు అని కూడా చూడకుండా అప్పుడే పుట్టిన బిడ్డలను చెట్ల పొదలలో... రోడ్డు పక్కన ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌ పడవేసి వెళ్ళిపోతున్నారు. కొన్ని సంధ‌ర్భాల్లో ఆ పసికందులను కుక్కలు లాక్కెళ్ళిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. త‌ల్లి ఒడిలో ఉండాల్సిన అభం శుభం తెలియని బిడ్డ‌ల‌పై దారుణంగా వ్య‌వ‌హిస్తున్నారు. ఆ పసి హృదయం ఎండ‌కి వాన‌కి ఎలా త‌ట్టుకుంటుందో అని కూడా ఆలోచించకుండా ఎక్కడపడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

తాజాగా అలాంటి ఘటనే విజయనగరంలో చోటు చేసుకుంది. పసిబిడ్డను రైలు పట్టాలపై వదిలి వెళ్లిపోయారు. అయితే ఈ పాపం తల్లిదండ్రుదా లేదా మరి ఎవరైనా పగతో చేసి ఉంటారా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. అంతే కాకుండా ప్రాణాలు ఉండ‌గానే బిడ్డ‌ను వ‌దిలి వెళ్లారా..? లేదంటే చ‌నిపోయిన త‌ర‌వాత వ‌దిలి వెళ్లారా అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే...  విజయనగరంలో రెండు నెలల పసికందు మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది. జిఆర్పి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంట కాపల్లి మ‌రియు కొత్త వలస రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై రెండు నెలల పసికందు మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు. రెండు పట్టాల మధ్యలో ఒక టవల్ చుట్టి ఆ పసికందు మృతదేహం కనిపిస్తోంది. ఆ బిడ్డ శరీరంపై లేత నీలం రంగు టీ షర్ట్ ధరించి ఉండగా చుట్టూ ఒక టవల్ కప్పి ఉంది. 

ఈ సన్నివేశం చూసినవారంతా కంటతడి పెట్టుకున్నారు. రెండు నెలల పసికందును అలా పట్టాల మద్యన వదిలేయడానికి చేతులు ఎలా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా పథకం ప్రకారం పసికందును హతమార్చి అలా పడి వేశారా..? లేదంటే తల్లిదండ్రులే తమకు భారం అవుతుందని వదిలేశారా..? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై స్పందించిన రైల్వ్యే రవి వర్మ మాట్లాడుతూ... పసికందు ఆచూకీ తెలిసినవారు విజయనగరం రైల్వే జి ఆర్ పి పోలీసులను గాని తమను సంప్రదించాలని తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలిస్తున్నామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: