హైదరాబాద్‌లో ఈనెల 25న మ్యాన్‌హోల్‌లో పడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రజనీకాంత్‌ ఉదంతం విషాదాంతం అయింది. మూడు రోజుల తర్వాత రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. ఈనెల 25వ తేదీన రాత్రి కురిసిన వర్షానికి.... మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ మృతి చెందాడు.  గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో ఉన్న నెక్నంపూర్‌ చెరువులో మృతదేహం బయటపడింది. నాలాలు కలిసే చోట.. గాలింపులో భాగంగా నెక్నంపూర్‌ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం లభ్యమైంది.

25వ తేదీ రాత్రి వర్షం పడుతున్న సమయంలో పెరుగు ప్యాకెట్‌ కోసం రజనీకాంత్‌ బయటకొచ్చాడు. మ్యాన్‌హోల్‌ కోసం తవ్విన గుంతలో అతను ప్రమాదవశాత్తు పడిపోయాడు. వర్షం నీళ్లు రోడ్డుపై నిలిచిఉండటంతో పక్కనే ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ రజనీకాంత్‌కు కనిపించలేదు. దీంతో అతడు అందులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. మణికొండ డ్రైనేజీలో గల్లంతు అయిన రజనీకాంత్‌ మృతదేహం దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకువెళ్లింది. మృతుడు గోపిశెట్టి రజనీకాంత్‌  షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

రజనీకాంత్‌ మృతితో అతని కుటుంబం కన్నీరుమున్నీరు అయింది. మణికొండలో డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ దగ్గర ఎలాంటి సైన్‌ బోర్డులు పెట్టడం లేదని.. మున్సిపల్‌  సిబ్బంది నిర్లక్ష్యమే రజనీకాంత్‌ ప్రాణాలు తీసిందని.... మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

రజనీకాంత్‌ ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నగరంలోని మణికొండ నుంచి నెక్నంపూర్ చెరువు వరకు గాలింపు చర్యలు చేపట్టింది. చివరకు స్థానికుల సహకారంతో చెరువులో మృతదేహాన్ని గుర్తించి... బయటకుతీశారు. రజనీకాంత్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకుంటుడటంపై నగరవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మ్యాన్‌హోల్స్‌ క్లీన్‌ చేసేందుకు వాటిని తెరిచిన తర్వాత.. మళ్లీ మూసివేయడంలో జరుగుతున్న జాప్యమే తరుచూ ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: