గుంటూరు జిజి హెచ్  లో దారుణం జరిగింది. ఈసీజీ తీసే సమయంలో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు సిబ్బంది. ఆమెను వివస్త్రను చేసి అమానవీయంగా ప్రవర్తించాడు. ఈ విచారణ పై పోలీస్ విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈసీజీ తీయాల్సిన శంకర్ అనే ఉద్యోగి కొన్ని రోజులుగా సెలవు  లో ఉన్నాడు. అతను అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్లోనే ఈసీజీ టెక్నీషియన్ గా శిక్షణ పొందుతున్న విద్యార్థి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. గుంటూరు లో గవర్నమెంట్ ఆసుపత్రి అరాచకాలకు అడ్డాగా మారింది. పాత గుంటూరు కు చెందిన యువతి కొద్దిరోజులుగా చాతి నొప్పితో బాధ పడుతోంది.దీంతో తల్లిదండ్రులతో కలిసి GGH కు వచ్చింది . పరీక్షించిన వైద్యులు ఈసీజీ పరీక్ష చేయించుకు రావాలని చీటీలో రాసి ఇచ్చారు. యువతి ఈసీజీ తీసుకోవడానికి వెళ్లగా ఆ విభాగంలో ఉన్న హరీష్ ఆమెతో వచ్చిన తల్లిదండ్రులను గది బయటకు పంపించాడు. యువతికి ఈసీజీ తీస్తానంటూ వస్త్రాలను  తొలగించ మన్నాడు. అందుకు ఆమె అడ్డు చెప్పడం తో అలాగైతే ఈసిజి సరిగా తీయలేమని చెప్పాడు. ఛాతి లోపల సమస్య ఏమిటనేది రిపోర్ట్ లో స్పష్టంగా రావాలంటే తప్పనిసరిగా వస్త్రాలు తీయాలంటూ ఒత్తిడి చేశాడు.

లైన్ లో చాలా మంది వేచి ఉన్నారు. త్వరగా తీసుకుంటావా లేదా అంటూ హడావుడి చేశాడు. ఆమె చేత బలవంతంగా బట్టలు విప్పించాడు. కళ్ళు మూసుకొని అక్కడున్న బల్లపై పడుకోవాలని చెప్పి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు హరీష్. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ ఉండగా ఆమె ప్రతిఘటించి బల్లపై నుంచి  లేచింది. లోపలకు వెళ్ళిన తన కుమార్తె ఎంతసేపైనా ఇంకా బయటికి రాకపోవడంతో తల్లిదండ్రులు హైరానా పడ్డారు. ఇంతలో లోపల నుంచి యువతి ఏడ్చుకుంటూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. కోపంతో అతన్ని నిలదీయగా తాను అలా ప్రయత్నించలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. సెల్ఫోన్ ఇవ్వాలని అడిగితే ఎదురుతిరిగాడు. దీంతో బాధితురాలు ఆమె తండ్రి GGH లోని అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. ఈసీజీ తీస్తానంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. GGH లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈసీజీ తీయాల్సిన శంకర్ అనే ఉద్యోగి కొద్దిరోజులుగా సెలవులో ఉన్నాడు. ఉన్నతాధికారులకు తెలియకుండా హరీష్ ను ఎందుకు విధులకు పిలిచారని శంకర్ ను పిలిచి విచారించారు. హరీష్ ఎవరో తనకు తెలియదని చెప్పాడు శంకర్. అతను అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రిలోనే ఈసీజీ టెక్నీషియన్  గా శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఈసీజీలు తీయిస్తున్నారని విచారణలో తేలింది. యువతిని ఫోటోలు తీసిన హరీష్ ఆసుపత్రి ఉద్యోగి కాదని, విధినిర్వహణలో ఉండాల్సిన శంకర్ లేడని, ఆసుపత్రి సూపరిండెంట్ ఒప్పుకున్నారు. మొత్తంగా ఆస్పత్రిలో పాలన వ్యవహారాలు గాడి తప్పాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటివి వెలుగులోకి రాని ఘటనలు ఇంకెన్ని ఉన్నాయో నని ఆందోళన చెందుతున్నారు రోగులు. యువతి గుర్తించి అరవడంతో ఈ విషయం బయటపడిందని, లేకపోతే ఇది వెలుగులోకి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీటిని కట్టడి చేయకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: