ట్రైనింగ్‌ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింగ్ చౌహన్‌పై సస్పెన్షన్‌ వేటు పడిన‌ది. అతనిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల‌ను వెలువ‌రించింది. నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ విధులు నిర్వహిస్తోన్న నర్సింగ్‌ చౌహాన్‌ తనను వేధించాడంటూ సునీత అనే ట్రైనింగ్‌ నర్సు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. తన ఛాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు అడిగే వాడు అని .. బావ వరుస అవుతానని చెంపలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడ‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న‌ది.

దీంతో శిక్ష‌ణ‌లో ఉన్న న‌ర్సింగ్ విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు అని, ఆరోపిస్తూ బాధితురాలు బంధువులు ఆసుప‌త్రి సూపరింటెండెంట్ పై దాడి చేసారు. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్‌లో  చోటు చేసుకుంది. పోలీసులు త‌మ‌కు అందించిన ఫిర్యాదు మేర‌కు ఇరువ‌ర్గాల‌పై కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ క‌మిష‌న‌ర్ సూప‌రింటెండెండ్ న‌ర్సింగ్‌చౌహ‌న్‌ను స‌స్పెండ్ చేస్తూ గురువారం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసారు.

సంగారెడ్డి  జిల్లా క‌ల్హేర్ మండ‌లం గిరిజ‌న తండాకు చెందిన సునిత (24) ఖేడ్ ప్రాంతీయ ఆసుప‌త్రిలో శిక్ష‌ణ పొందుతున్న‌ది. ఈనెల 1వ తేదీన ఆమె విధులు ముగించుకుని వెళ్తుండ‌గా సూప‌రింటెండెంట్ చౌహ‌న్ పిలిచి తొంద‌ర‌గా ఎందుకు వెళ్లుతున్నావు అని ప్ర‌శ్నించారు. బ‌స్సుకు స‌మ‌యం లేదు, అందుకే త్వ‌ర‌గా వెళ్తున్నాను అని ఆ యువ‌తి స‌మాధానం చెప్ప‌గా.. నీతో ప‌ని ఉంద‌ని, ఇలా వెళ్లితే ఎలా..? అని క్లాస్ తీసుకొని త‌న ఛాంబ‌ర్‌కు పిలిపించారు.

సూప‌రింటెండెంట్ రూమ్‌లోకి పిలిపించుకుని ఆమె వ్య‌క్తి గ‌త విష‌యాల‌ను అడుగుతూ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించార‌ని బాధితురాలు కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. ముందుగా వారు ఓ షాపింగ్ మాల్ వ‌ద్ద‌కు న‌ర్సింగ్ చౌహ‌న్‌ను పిలిపించారు. ఆ స‌మ‌యంలో వారి వ‌ద్ద వాగ్వాదం జ‌రిగిన‌ది. ఆ త‌రువాత సూపరింటెండెంట్‌ను ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ వ‌ద్ద‌కు తీసుకొచ్చి దాడి చేసారు. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు సూప‌రింటెండెంట్‌పై, సూప‌రింటెండెంట్ ఫిర్యాదు మేర‌కు బాధితురాలుతో పాటు ఆమె కుటుంబీకులు, బంధువుల‌పై కేసులు న‌మోదు చేసారు నారాయ‌ణ‌ఖేడ్ పోలీసులు. శిక్ష‌ణ‌లో ఉన్న న‌ర్సింగ్ విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు సస్పెండ్ చేసిన‌ట్టు వైద్య విధాన క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. వెంట‌నే ఈ ఉత్త‌ర్వులు అమ‌లులోకి వస్తాయి అని తెలిపారు. అదేవిధంగా శుక్ర‌వారం నారాయ‌ణ‌ఖేడ్ ప్రాంతీయ ఆసుప‌త్రిని సంద‌ర్శించి స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని సంగారెడ్డి  జిల్లా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ సంగారెడ్డిని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: