తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం త‌రువాత‌ కొంత మంది బాలికలు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నట్టు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసారు. వాళ్లకు ప్రాథమిక చికిత్స అందించే సమయంలోనే.. ఇంకొంత మంది కళ్లు తిరుగుతున్నాయని, మరికొందరూ వాంతులవుతున్నట్టు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు.

ఉపాధ్యాయులు  వెంటనే  అప్రమత్తమై  అందరినీ అంబులెన్స్‌లో చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది ఎవ‌రూ లేకపోవడం గ‌మ‌నార్హం. మ‌ళ్లీ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం నుంచి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్దులంద‌రూ 5, 6, 7 తరగతులకు చెందినవారు. అస్వస్థతకు గురైన తోటి విద్యార్థులను చూసి.. ఆందోళన చెందిన మరికొంత మంది కండ్లు  తిరిగి పడిపోయారు.

మధ్యాహ్నం భోజనం చేసిన కొద్ది సేప‌టికే  కడుపునొప్పి రావటం వల్ల.. టీచర్కు చెప్పానని.. అలా చెప్పుకుంటూనే కళ్లు తిరిగి పడిపోయాను ఓ విద్యార్థిని ప‌రిస్థితిని వివ‌రించారు. అదేవిధంగా మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అర‌గంట వ‌ర‌కు అంద‌రూ బాగానే ఉన్నార‌ని, ఆ త‌రువాత ఒక‌మ్మాయి క‌డుపునొప్పి వ‌స్తుందంటూ వ‌చ్చిన‌ది. ఆమెను ప‌రిశీలించే స‌మ‌యంలోనే ఒక‌రి త‌రువాత ఒక‌రూ కండ్లు తిరుగుతున్నాయ‌ని, క‌డుపు నొప్పితో వ‌చ్చారు. వెంట‌నే అంబులెన్స్‌లో చొప్ప‌దండి ఆసుప‌త్రికి తీసుకొచ్చామ‌ని, అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డం వ‌ల్ల నేరుగా క‌రీంన‌గ‌ర్ ఆసుప‌త్రికి తీసుకొచ్చిన‌ట్టు చొప్ప‌దండి గురుకుల పాఠ‌శాల హెల్త్ సూప‌ర్ వైజ‌ర్ స్పంద‌న వెల్ల‌డించింది.

ఇప్పుడూ అంద‌రు బాగానే ఉన్నార‌ని, పిల్ల‌ల‌తో పాటుమేము కూడా అదే భోజ‌నం తిన్నామ‌ని.. ప్రిన్సిపాల్ కూడా ఇదే భోజ‌నం తింటారని వివ‌రించారు. ముఖ్యంగా భోజ‌నంలో అయితే ఎలాంటి క‌ల్తీ లేద‌ని చెప్పిన‌ది. తొలుత బాధిత విద్యార్థినులందరికీ కరీంనగర్ ఆసుపత్రిలో  చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగానే ఉన్నట్టు వైద్యులు  పేర్కొన్నారు.  ఆహారం వికటించటం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారని,  ఆహారం కలుషితం కావడంపై స్థానిక తహసీల్దార్ విచారణ కూడా చేపట్టారు. అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు విష‌యం తెలుసుకున్న కొంత మంది విద్యార్థినుల త‌ల్లిదండ్రులు హుటాహుటిన ఆసుప‌త్రికి చేరుకున్నారు. అయితే కొంత‌మంది ఆందోళ‌న చెందడంతో ఉపాధ్యాయులు ధైర్యం చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: