నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. గంజాయి ముఠా ఆధిపత్య పోరులో భాగంగా ఒక యువకుడిని హింసించి చంపి తీసుకువచ్చి పోలీసు స్టేషన్ ముందు పడేసిన సంఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కే.జోస్ జోమోన్ అనే రౌడీ షీటర్ కొట్టాయంలో గంజాయి, డ్రగ్స్ దందా చేస్తుంటాడు. ఇక పాత కక్షల కారణంగా ముత్తంబలంలో నివసించే షాన్ బాబు(19) అనే యువకుడిని ఆదివారం రాత్రి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు.  

ఇక బయటకు వెళ్లిన కొడుకు ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో షాన్ బాబు తల్లి స్ధానిక ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాన్ బాబు కోసం నగరంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  పోలీసులు గాలిస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత జోమోన్, షాన్ బాబు మృతదేహాన్ని భుజాలపై మోసుకుని వచ్చి పోలీసు స్టేషన్ ముందు పడేసి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

మృతుడి కోసం పోలీసులు ఓ వైపు గాలింపు చర్యలు చేపట్టగా షాన్ బాబును కిడ్నాప్ చేసిన జోమోన్ ఆటోలో చిత్ర హింసలకు గురి చేస్తూ కొట్టాయంలోని పలు ప్రాంతాల్లో తిప్పారు. చివరికి అతడు మృతి చెందాడని నిర్ధారించుకుని పోలీసు స్టేషన్ ముందుకు ఆటో తీసుకు వచ్చి… భుజాలపై షాన్ బాబు మృతదేహాన్ని తీసుకువచ్చి పడేశారు.

అయితే జోమోన్ పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక గతేడాది నవంబర్ లో అతను నగర బహిష్కరణకు కూడా అయ్యాడు. అతను మళ్ళి ఊరులోకి తిరిగి వచ్చి తన కార్యకలాపాలు ప్రారంభించే క్రమంలో ప్రత్యర్ధి వర్గం వారిపై దాడులు చేయటం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే బాబును అపహరించి హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అంతేకాదు.. షాన్‌బాబును బలమైన ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కొట్టాయం ప్రభుత్వాసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. అయితే మరణించిన షాన్ బాబు పై ఎలాంటి కేసులు లేవని పోలీసులు నిర్దారింఛి తెలిపారు. నిందితుడు జోమొన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: