నీరో చ‌క్రవ‌ర్తిని త‌ల‌పించే రాజ‌కీయాలు దేశంలో క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు మేధావులు. స్వ‌తంత్ర దేశంగా భార‌త్ అవ‌త‌రించిన త‌ర్వాత అనేక గ‌డ్డు ప‌రిస్థితుల‌ను, పొరుగు దేశాల‌తో వైరాల‌ను, యుద్ధాల ‌ను చవి చూసింది. ఆయా సంద‌ర్భాల్లో దేశం మొత్తం ఏక‌మైంది. భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని నిరూపించేలా, భ‌ర‌త గ‌డ్డ‌పైకి దండెత్తిన వారి పీచ‌మ‌ణిచేలా.. ప్ర‌జ‌లను ఏక‌తాటిపైకి న‌డిపించారు అప్ప‌టి రాజ‌కీయ నా య‌కులు. పార్టీలు ఏవైనా.. జెండాలు.. అజెండాలు ఎన్నున్నా.. విదేశాల నుంచి క‌వ్వింపులు ఎదురైనప్పు డు.. అంద ‌రూ ఒక్క‌టే అనే సందేశాన్ని చాటి చెప్పారు. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా కూడా ప్ర‌జ‌లు ఒక్క‌ట ‌య్యేవారు. ముందు దేశం.. త‌ర్వాతే మిగ‌తావి! అనే స్ఫూర్తిని నింపేవారు. 


అయితే, ఈ ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించడం లేదు. పొరుగు దేశ‌మైన‌.. చైనా నుంచి భార‌త్‌కు క‌వ్వింపులు ఎ దురవుతున్న వేళ‌..ఇప్ప‌టికే రెండు ప‌దుల సంఖ్య‌లో సైనికుల‌ను కోల్పోయిన వేళ‌.. అంద‌రూ సంయుక్త మై.. యుక్తిగా మెల‌గాల్సిన స‌మ‌యంలో.. భ‌ర‌త‌మాత ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుంబిగించాల్సిన త‌రుణంలో అధికా ర‌, ప్ర‌తిప‌క్షాలు నీతిమాలిన రాజ‌కీయాలకు తెగ‌బ‌డ‌డం, నువ్వు  పోక చెక్క అయితే.. నేను త‌లుపు చెక్క అనే లా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం వంటివి విశాల జ‌న‌హిత‌మే పాల‌క, ప్ర‌తిప‌క్షాల విహిత ల‌క్ష్య‌మని తొలి పార్ల‌మెంటులో బాబూ రాజేంద్ర ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌ల‌కు అర్ధ‌మే లేకుండా పోయే ప‌రిస్థితి దాపురించింది. 


ప్ర‌స్తుతం చైనా దూకుడు మ‌రింత పెరిగింది.  నోటితో న‌వ్వుతూ.. నొస‌టితో వెక్కిరించింద‌న్నట్టుగా.. ఒక వైపు మేం మీ మిత్రులం అని నంగి మాట‌లు చెబుతూనే.. గాల్వాన్ లోయ‌లో హ‌ద్దులు మీరుతోంది. దీనిని ఏ భార‌తీయుడు ఉపేక్షించే ప‌రిస్థితి లేదు. మ‌రి ఈ స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న బీజేపీ కానీ, ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ కానీ.. ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించాలి? ఎలా ముందుకు సాగాలి?  నిజానికి దేశ హిత‌మే దిశానిర్దేశం కావాలి. కానీ, కుళ్లు రాజ‌కీయాలు, కుళ్లు విమ‌ర్శ‌ల‌కు తెర‌లెత్త‌డం గ‌మ‌నార్హం. చైనా దురాక్ర‌మ‌ణ ఎప్ప‌టి నుంచో సాగుతోంద‌ని, లేక‌పోతే.. 20కి పైగా సైనికులు ఎందుకు అమ‌ర‌వీరులు కావా ల్సి వ‌చ్చింద‌న్న కాంగ్రెస్ ప్ర‌శ్న స‌హేతుకంగానే ఉంది. అయితే, దీనిపై బీజేపీ నుంచి స‌రైన స‌మాధా నాన్ని రాబ‌ట్ట‌డంలో.. కాంగ్రెస్ దారి త‌ప్పింది. 


ఎప్పుడైనా స‌రే.. విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. ఈ విష ‌యాన్ని లౌక్యంగా గుర్తించి.. విష‌యాన్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేయాల్సిన కాంగ్రెస్ పీఎం కేర్ ఫండ్స్‌కు చై నా నుంచి నిధులు అందాయ‌ని చేసిన విమ‌ర్శ‌.. మొత్తంగా విష‌యాన్ని ప‌ట్టాలు త‌ప్పించేసింది. దేశభద్ర తకు అత్యంత ఆందోళన కలిగించే నిజం ఏమిటంటే... తన పీఎం కేర్స్ ఫండ్ కోసం చైనా కంపెనీల నుం చి ప్రధాని మోదీ డొనేషన్లు అందుకున్నారు. పీఎం కేర్స్ ఫండ్ వివరాలు కానీ, ఏ విధంగా పనిచేస్తుందని కానీ ఏ ఒక్కరికీ తెలియదు. ఆ డబ్బు ఎవరి కంట్రోల్‌లో ఉందో, ఎలా ఉపయోగిస్తారో కూడా తెలియదు- అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 


అంతేకాదు, ``మే 20న ప్రధాని మోడీ రూ.9,678 కోట్లు పీఎం కేర్స్ ఫండ్‌ కోసం అందుకున్నట్టు కథనాలు న్నాయి. చైనా మన భూభాగాంలోకి చొరబడినప్పటికీ చైనా కంపెనీల నుంచి ప్రధాని ఈ నిధులను అందు కోవడం దిగ్భ్రాంతికరం. చైనా ఎప్పుడూ మన భూభాగంలోకి అడుగుపెట్టడం కానీ, ఆక్రమించుకోవడం కానీ చేయలేదని ప్రధాని చెబుతున్నారు. చైనా దుష్ట ఎజెండాకు అనుగుణంగా ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదా రి పట్టిస్తున్నారు..`` అని కాంగ్రెస్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించింది. ఈ ప‌రిణామంతో..  బీజేపీ అస‌లు విష యాన్ని దాచేసి ఎదురు దాడి ప్రారంభించేసింది. 


``2005 నుంచి 2009 వరకూ చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు వచ్చాయి. పన్ను ఎగవేతదారుల స్వర్గధామమైన లక్సెంబర్గ్ నుంచి 2006-2009 మధ్య ప్రతి ఏడాది డొనేషన్లు అందుకుంది. ఇది దేనిని సూచిస్తోంది?. ఎన్జీవోలు, కంపెనీలు లోతైన వాణిజ్య ప్రయోజనాలతోనే ఫౌండేషన్‌కు డబ్బులు విరాళం ఇచ్చారు`` అని బీజేపీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది.  ఫ‌లితంగా చైనా ప‌రిణామాలు.. ప‌క్క‌కు పోయి.. రాజ‌కీయ యుద్ధానికి కాంగ్రెస్‌-బీజేపీలు క‌త్తులు నూరాయి. అంతే త‌ప్ప‌.. దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు పొంచి ఉన్న స‌మ‌యంలో ఇరు ప‌క్షాలూ చేతులు క‌లిపి ముందుకు సాగాల‌నే ఆలోచ‌నే చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


వాస్త‌వానికి ఈ విష‌యం ఎందుకు చ‌ర్చించాల్సి వ‌స్తోందంటే.. ప్ర‌పంచ మీడియా ఈ అంశాల‌నే హైలెట్ చేసింది. ఒక వైపు దేశం హ‌ద్దుల్లోకి చైనా చొర‌బాట్లు పెరుగుతుంటే.. భార‌త్‌లో రాజ‌కీయ ఆధిప‌త్య చొర‌బాట్లు జ‌రుగుతున్నాయంటూ.. అంత‌ర్జాతీయ మీడియా భార‌త్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. మొత్తంగా.. ఇటు కాంగ్రెస్‌.. అటు బీజేపీ.. మ‌ధ్య‌లో చైనావాడి దూకుడు బాగుందని అంత‌ర్జాతీయ మీడియా ఘోషిస్తున్నా.. మ‌నోళ్ల‌కు మెల‌కువ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: