ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వలోని అధికారుల ఎంపికలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. అయితే... ఈయన మరికొద్ది కాలంలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో.. నెక్స్ట్ సీఎస్ పై ఇంట్రస్టింగ్ చర్చ తెరపైకి వచ్చింది.
ఈ తరుణంలో ఏపీకి కాబోయే సీఎస్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. దానికి కారణం... ఎప్పటిలాగానే సీనియారిటీ జాబితాను పరిగణలోకి తీసుకుంటే ఓ ఆసక్తికర పేరు వచ్చిందని అంటున్నారు. ఆమెకు చంద్రబాబు ఏమాత్రం అంగీకారం తెలపరని నొక్కి చెబుతున్నారు. ఎందుకంటే... సీనియారిటీ జాబితాలో టాప్ లో ఉన్న పేరు యర్రా శ్రీలక్ష్మీ అని చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి చాలా కీలకంగా వ్యవహరించారని అంటారు! ఇక జగన్ అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు సైతం వెళ్లి వచ్చారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో వైసీపీ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఆమెకు కీలక పదవి దక్కింది. రాష్ట్ర మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆమె వ్యవహరించారు. అయితే... వైసీపీ సర్కార్ పోయి కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి నేటి వరకూ ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు! సీనియరిటీ సంగతి కాసేపు పక్కనపెడితే.. చంద్రబాబు చూపు మాత్రం ఓ అధికారివైపు ఉందని అంటున్నారు. ఏపీ ఎనర్జీ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కే విజయానంద్ పేరును ఆయన పరిశీలిస్తున్నారని అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్ కో, ఏపీ ట్రాన్స్ కో సీఎండీగా పనిచేసిన విజయానంద్.. రాష్ట్ర విభజన దగ్గర నుంచి నేటి వరకూ విద్యుత్ శాఖకే సేవలందిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వాలు మారినా.. ఆయన పనిచేసే శాఖ మాత్రం మారడం లేదు. దీంతో... దీనికి ఆయనకు విద్యుత్ శాఖపై ఉన్న పట్టే కారణం అని అంటున్నారు.