దానవీరశూర కర్ణ.. ఎన్టీఆర్‌ నటనావైదుష్యానికి ఇదో మచ్చుతునక.. టైటిల్‌ రోల్‌ కర్ణునిగా, సుయోధునిగా, కృష్ణునిగా ఎన్టీఆర్‌ ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించి నభూతో.. అనిపించారు. అందులోనూ ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఆయనే. ఈ సినిమా పేరు చెప్పగానే.. “ ఆచార్యదేవా..! హ హ హ హ.. ఏమంటివి ఏమంటివి..! జాతినెపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…? హ్హ..! ఎంత మాట ఎంత మాట..!.. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే.. కాదు..  కాకూడదు.. ఇది కుల పరీక్షయే అందువా... నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది.. అంటూ సాగే సుదీర్ఘ సంభాషణలు ఎన్టీఆర్‌కు ఖ్యాతిని స్థిరం చేశాయి.


మరి ఈ డైలాగులు రాసిందెవరో తెలుసా.. అతడో మహారధి.. మహాభారతాన్ని మధించి సామాన్యుల దరి చేర్చిన ఆయన పేరు కొండవీటి వెంకటకవి. మహాభారతం కొన్ని వందల ఏళ్లుగా పవిత్ర గ్రంధంగా కొనియాడపడుతున్నా అందులో పాత్రల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకున్న వాళ్ళు  అతి తక్కువమంది సమాజం దృష్టిలో వారు మహాపండితులు కానీ వారే నాడు ఆ పాత్రల గుట్టు విప్పలేదు. 1976లో ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా తీయదలచి సంభాషణల రచయితగా పని చేయాలని కొండవీటి వెంకటకవి గారిని పిలిపించారు.


అప్పటికే పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆయన ఆ వినతిని తిరస్కరించారు.  ఎన్టీఆర్ వ్యక్తిగతంగా అభ్యర్ధించడంతో వారు సినిమాకు ఒప్పుకోవడంతో ఓ మహా ఘట్టానికి బీజం పడింది. ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి.. అంటూ ఆంధ్ర దేశం మారు మోగింది. మహా పాత్రల పుట్టు పూర్వోత్తరాల గుట్టు వెండితెర విప్పింది. కొండవీటి వెంకటకవి గుంటూరు సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో నారాయణ శేషమ్మ దంపతులకు 1918 జనవరి 25 న జన్మించారు. కొండవీటి వెంకట కవి హేతువాది మరియు కవిరాజు త్రిపురనేని రామస్వామి అనుచరుడు. 1970లొనే నాటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆవుల సాంబశివరావు గారి కుమార్తె ఆవుల మంజులత వివాహం హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంత్రాల తతంగాలు లేకుండా హేతువాద పద్ధతిలో ఇన్నయ్య గారితో కలసి ఈయన నిర్వహించారు.


గొప్ప వేదాంతి తాత్వికుడు బహుముఖ ప్రజ్ఞాశాలి 1983 నుంచి 1991లో ఆయన మరణించే వరకు ఈనాడు పత్రికలో పరదేశీ పాఠాలు పేరున రచనలు అందించారు. హేతువాది గా తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎన్నో అడుగులు వేసిన ఆయన రచయితగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: