తెలంగాణ రాజ‌కీయాల్లో కేసీఆర్‌కు దీటైన నాయ‌కుడిగా ఎద‌గ‌గ‌లిగేది ఎవ‌రు..?  తెలంగాణ ఇచ్చి కూడా ఆ క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికీ నాయ‌క‌త్వ‌లేమితో కొట్టుమిట్టాడుతూనే ఉండ‌టానికి కార‌ణ‌మేమిటి..? ఆ పార్టీ సానుభూతిప‌రుల‌ను తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ప్ర‌శ్న‌లివి. 2014 దాకా అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు నానాటికీ తీసిక‌ట్టుగా మార‌డానికి గ‌ల‌ కార‌ణాల్లో నాయ‌కుల మ‌ధ్య వ‌ర్గ పోరాటం కూడా ఒక‌టి. అయితే అంత‌కుమించిన కార‌ణాలు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చాక కాంగ్రెస్ లో టీఆర్ఎస్‌ను విలీనం చేసేందుకు కేసీఆర్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను అప్పట్లో కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్క‌రించ‌డానికి.. నాటి రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులే కార‌ణ‌మ‌ని చెబుతారు. అయితే పార్టీని ఆదుకునేందుకు వారంతా ఇప్పుడేమ‌య్యారో ఎవ‌రికీ తెలియ‌దు. నిజానికి 2014 ఎన్నిక‌ల్లో విజ‌యంపై పూర్తి న‌మ్మకం కేసీఆర్‌కు కూడా లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతారు. అయితే ఆయ‌న‌ను అదృష్టం వ‌రించింది. బొటాబొటి మెజారిటీతో పార్టీ కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా మోదీ ఆధ్వ‌ర్యంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం కేసీఆర్‌కు క‌లిసివ‌చ్చింది. వారితో స‌త్సంబంధాలు నెర‌ప‌డం ద్వారా బ‌లం పెంచుకున్నారు.

బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త‌భార‌త్‌. కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ‌. అందుకే కేసీఆర్‌కు మోదీషాల అండ దొరికింది. ఇక్క‌డే కేసీఆర్ త‌న‌లోని సిస‌లైన రాజ‌కీయ చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను, అంత‌వ‌ర‌కు పార్టీలో కీల‌కంగా ఉన్న నేత‌ల‌ను న‌యానో భ‌యానో త‌న పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా పార్టీ బ‌లాన్ని పెంచుకున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయ‌డం ద్వారా ఆ ఓటు బ్యాంక్ అధిక శాతం టీఆర్ఎస్ వైపు మ‌ళ్లేలా చేసుకున్నారు. నిజానికి బీజేపీ, టీడీపీ అప్ప‌టికి మిత్ర‌ప‌క్షాలుగా ఉన్నాయి.  అయినా కేసీఆర్ తాన‌నుకున్న‌ది చేయ‌గ‌లిగారు. ఆ త‌రువాత రైతుబంధు వంటి సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల్లో బ‌లం పెంచుకున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయలో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ ప్ర‌జ‌ల్లో కేసీఆర్ పాల‌న‌పై న‌మ్మ‌కం పెంచింది. ఇంతింతై వ‌టుడింతై అన్నట్టుగా కేసీఆర్ తెలంగాణ రాజ‌కీయాల్లో త్రివిక్ర‌ముడిగా ఎదిగిపోయారు. మ‌రోప‌క్క కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వ లోపం ఆ పార్టీకి శాపంగా మారింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి ఉన్న ప్ర‌జాక‌ర్ష‌ణ  కూడా ఘ‌న చ‌రిత్ర ఉన్న ఆ పార్టీలో ఉన్న నేత‌లెవ‌రికీ లేక‌పోవ‌డం విస్మ‌య‌ప‌ర‌చే అంశం.

 2018లో ఏడాది ముందుగానే తిరిగి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ రెండోసారి ఘ‌నవిజ‌యం సాధించారు. కాంగ్రెస్ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారానికి సుదూరంగా ఉండిపోవ‌డంతో పార్టీ క్యాడ‌ర్లో ఆత్మ‌విశ్వాసం దెబ్బ‌తింది. తెలంగాణ రాజకీయ, సామాజిక ప‌రిస్థితుల‌పై స‌మ‌గ్ర అవ‌గాహ‌న ఉన్న‌ సీనియ‌ర్ నాయ‌కుడిగా మ‌ళ్లీ రాష్ట్ర రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషించ‌వ‌చ్చ‌ని ఆశ‌ప‌డిన జానారెడ్డి సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ ఓట‌మి పాల‌వ‌డం క్యాడ‌ర్‌ను నిరాశ‌ప‌ర‌చేదే. వ‌ర్గాల పోరుతో నిన్న‌టిదాకా స‌త‌మ‌త‌మైన కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికీ పూర్తిగా తెరిపిన ప‌డిన‌ట్టు క‌నిపించ‌డంలేదు. పార్టీలో రేవంత్ ఒంట‌రిగా పోరాడుతున్నారు. మ‌రోప‌క్క  టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నుంచి నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య‌ బ‌య‌ట‌కు వెళ్లిన ఈటెల రాజేంద‌ర్ కానీ అటు తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ బీజేపీ పార్టీ గానీ ముందుముందు త‌న‌కు ప‌క్క‌లో బ‌ల్లెంగా మార‌కుండా కేసీఆర్ ముంద‌స్తు వ్యూహం ర‌చించుకుంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌రింత ప‌దును పెడుతున్నారు. ఇందులో భాగంగానే వ‌చ్చే నెల‌లో రైతుబంధు ప‌థ‌కం కింద రైతుల‌కు ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్టు తాజాగా ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, స్థిరీకరించాలన్న తమ ధ్యేయం నెరవేరిందని, మిషన్ కాకతీయతో పాటు, కాళేశ్వ‌రం వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని పేర్కొన‌డం ఇందులో భాగ‌మే. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్‌ను స‌మ‌ర్థంగా నిలువ‌రించ‌గ‌ల నాయ‌కుడు ఎవ‌ర‌న్న‌ది చెప్ప‌డం అంత తేలికైన విష‌యం కాదు. బ‌హుశా బీసీల్లో కొంత సానుభూతి ఉన్న ఈటెల రాజేంద‌ర్ ఏపార్టీలో చేర‌నున్న‌దీ తేలితే భ‌విష్య‌త్ రాజ‌కీయ ముఖ‌చిత్రంలో కొంత స్ప‌ష్ట‌త రావ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: