తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర బెయిల్ ను ర‌ద్దుచేయాలంటూ హైకోర్టులో ఏసీబీ పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. కోర్టు ఈరోజు ఆ పిటిష‌న్‌ను కొట్టేయ‌డంతో ఏసీబీతోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా షాక్ త‌గిలింది. బెయిల్ ల‌భించిన త‌ర్వాత ఆ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి విజ‌య‌వాడ‌లో సంగం డెయిరీ డైరెక్ట‌ర్ల స‌మావేశం నిర్వ‌హించార‌ని, దీన్ని బెయిల్ ష‌ర‌తుల‌ను ఉల్లంఘించ‌డ‌మేనంటూ ఏసీబీ త‌న పిటిష‌న్‌లో పేర్కొంది. ఏసీబీ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ వేయ‌డానికి ముందే విజ‌య‌వాడ పోలీసులు క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ ఆ స‌మావేశానికి సంబంధించి కేసు కూడా న‌మోదు చేశారు.

ధూళిపాళ్ల న‌రేంద్ర‌పైనే ఎందుకు?
రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత కొద్దికాలం నెమ్మ‌దించిన ధూళిపాళ్ల న‌రేంద్ర ఒక్క‌సారిగా ఒక స్టింగ్ ఆప‌రేష‌న్‌తో ప్ర‌భుత్వానికి భారీ షాకిచ్చారు. రాజ‌ధానికి సంబంధించిన ద‌ళిత రైతులు కొంద‌రు త‌న‌ను ఆశ్ర‌యించార‌ని, వారి భూముల‌ను బ‌లవంతంగా తెలుగుదేశంపార్టీ నేత‌లు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చెప్పిన మాట‌లు స‌త్య‌దూరాలంటూ న‌రేంద్ర ఆ రైతుల‌తోనే ఒక  వీడియో రికార్డు చేయించి విడుద‌ల చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు ధోర‌ణితోనే వ్య‌వ‌హ‌రించి జైలుకు పంపించిందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా గుంటూరు, కృష్ణా, ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సంగం డెయిరీ రోజురోజుకు బ‌లోపేత‌మ‌వుతోంది. ప్ర‌తి 30 కిలోమీట‌ర్ల‌కు ఒక చిల్లింగ్ సెంట‌ర్ ఏర్పాటుచేస్తూ రైతుల ద‌గ్గ‌ర నుంచి పాల సేక‌ర‌ణ‌కు అత్య‌ధిక ధ‌ర చెల్లిస్తూ వ‌స్తోంది. దీనివ‌ల్ల అమూల్ డెయిరీని బ‌లోపేతం చేయ‌డం క‌ష్ట‌మ‌నేది ప్ర‌భుత్వ భావ‌న అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. సంగం డెయిరీ, విశాఖ డెయిరీ, విజ‌య డెయిరీలాంటివాటిని నిర్వీర్యం చేస్తేనే అమూల్ రాష్ట్రంలో మ‌న‌గ‌గ‌లుగుతుంద‌ని చెబుతున్నారు.

స్వామికార్యం, స్వ‌కార్యం నెర‌వేర‌తాయ‌ని
పార్టీప‌రంగాను, డెయిరీ ప‌రంగాను ప్ర‌యోజ‌నాలు స‌మ‌కూరతాయ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావించ‌డంవ‌ల్లే ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. నిన్న పొన్నూరు స‌మీపంలోని చింత‌ల‌పూడి గ్రామం వెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు న‌రేంద్ర‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి వ‌చ్చారు.

హైకోర్టు ఆలోచ‌న వేరు!
హైకోర్టు ఏసీబీ పిటిష‌న్‌ను కొట్టేసింది. ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ ఇచ్చిన తర్వాత నెల రోజులు బెజ‌వాడ‌లోనే ఉండాల‌ని ఆదేశించింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. వాటిని కూడా కోర్టు స‌స్పెండ్ చేసింది. డెయిరీ చైర్మన్ నేతృత్వంలో  డైరక్టర్లే సంస్థను నడిపించుకోవ‌చ్చ‌ని తేల్చిచెప్పింది. దీంతో న‌రేంద్ర నెల‌రోజులు విజయవాడలోనే ఉండటంతోపాటు ఆ స‌మ‌యంలో ఒక హోట‌ల్‌లో డైరెక్ట‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ధూళిపాళ్ల‌ను ఎలాగైనా జైలుకు పంపించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న ప్ర‌భుత్వం మ‌ళ్లీ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను దాఖ‌లు చేయించింది. అలాగే డెయిరీలో సోదాలు నిర్వ‌హిస్తామంటూ త‌రుచుగా పిటిష‌న్లు కూడా దాఖ‌లు చేస్తోంది. వీట‌న్నింటినీ హైకోర్టు కొట్టేస్తుండ‌టంతో ఇక‌నైనా క‌క్ష‌సాధింపు రాజ‌కీయాలు మానుకోవాల‌నే హిత‌వు అందులో ఇమిడివుంద‌ని, దాన్ని ప్ర‌భుత్వం అర్థం చేసుకోవాల‌ని న్యాయ‌నిపుణులు సూచిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

tag