ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందన్న విమర్శలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఏపీ సర్కారు లెక్కకు మించి అప్పులు చేస్తోందని.. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏకంగా కేంద్రానికి గతంలోనే లేఖలు రాశారు.. తాజాగా ఆయన రాష్ట్రపతికి కూడా కంప్లయింట్ చేశారు. ఏకంగా ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీ పెట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం, రాష్ట్రం మధ్య ఆర్థిక అంశాలు చర్చకు వస్తున్నాయి.


ఏపీ విషయం పక్కకు పెడితే.. అసలు కేంద్రం, రాష్ట్రం మధ్య ఆదాయం పంపిణీ విషయం చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్రాలకు ఆదాయం అనేక రకాలుగా వస్తుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా.. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన సొమ్ములు.. ఇవే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు. వీటితో పాటు రాష్ట్రాలకు సొంత ఆదాయం కొంత ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా పడిపోయింది.


ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది జీఎస్టీ.. జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలకు చాలా వరకూ ఆదాయం పడిపోయింది. ఈ ఆదాయం పడిపోతే.. నష్టపరిహారం ఇస్తామన్న కేంద్రం మాటలు నీటిమూటలవుతున్నాయి. అందుకు కరోనా అనేది గాడ్‌ ఆఫ్‌ యాక్ట్‌గా చెబుతూ కేంద్రం మొండిచేయి చూపుతోంది. దీనికితోడు.. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు నిధులు పంపకం బాగా తగ్గిపోయింది. గ్రాంట్లలోనూ కోత విధించింది. ఇలా అన్ని వైపుల నుంచి కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందుతున్న ఆదాయం గణనీయంగా పడిపోయింది.


కేంద్రం తాను గతంలో చెప్పిన వాగ్దానాలు కూడా రాష్ట్రాల పట్ల అమలు చేయడం లేదు. ఇలా తానే అడ్డదారులు తొక్కుతున్న కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలకు నీతి సూత్రాలు చెప్పే పరిస్థితుల్లో లేదు. దీని కారణంగా రాష్ట్రాలు అడ్డదారుల్లో అప్పులు తీసుకునే పరిస్థితి వస్తోంది. కేంద్రం పెట్టదు.. రాష్ట్రాలను అడుక్కుతిననివ్వడం లేదన్న రాష్ట్రాల ఆవేదన సహేతుకమే.

మరింత సమాచారం తెలుసుకోండి: