అఫ్గానిస్తాన్ లో మరో రెండు రోజుల్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈమేరకు తాలిబాన్ టాప్ లీడర్ షిప్ కౌన్సిల్ మూడురోజులపాటు సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. తాలిబాన్ నేత హీబాతుల్లా అఖుంద్ జాదా నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ కొత్త ప్రభుత్వం బ్లూప్రింట్ ను ప్రపంచం ముందుకు తేనున్నారు. ఆ కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోందనే విషయాన్ని పక్కనబెడితే అది కచ్చితంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోబోతోందని నిపుణులు చెబుతున్నారు. తాలిబాన్లు కాబుల్ ను ఆక్రమించి పదిహేను రోజులు దాటిపోయినా, అక్కడ పాలన ఇంకా అస్తవ్యస్తంగానే ఉంది. నిత్యావసరాలు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల కోసం జనం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబాన్లు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందు ముందు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడుతున్నారు. తాలిబాన్లు ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కోబోతున్నారని దౌత్యవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ముందు ఎదురైతే, రెండోది ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదలు కానుందని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వంలో ఎక్కువ అధికారాల కోసం తాలిబాన్ రాజకీయ గ్రూపు(దోహా గ్రూపు), పోరాడే మిలటరీ గ్రూపు మధ్య తగాదాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాను తరిమికొట్టాలనే లక్ష్యంతో ఒక్కటిగా ఉన్నారని, ఇప్పుడు లక్ష్యం నెరవేరడంతో గ్రూపు తగాదాలు బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అఫ్గానిస్తాన్ వ్యతిరేక గ్రూపులను కూడా ఎదుర్కొనే సవాళ్లు రావచ్చంటున్నారు. తాలిబాన్ పొలిటికల్ లీడర్ షిప్ లో హీబాతుల్లా అఖుంద్ జాదా అత్యంత ముఖ్యమైన నేతగా ఉన్నారు. తాలిబాన్ మిలటరీ నేతగా కమాండర్ సిరాజుద్దీన్ హక్కానీ ఉన్నారు. తాలిబాన్లలో ఆయన నంబర్ టూ స్థానంలో ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో హీబాతుల్లా అఖుంద్ జాదా అతిపెద్ద నేత అయితే పొలిటికల్ లీడర్ షిప్ మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. ఇప్పటి వరకు తాలిబాన్లు పోరాటాలలోనే గడిపారు. అందుకే సిరాజుద్దీన్ హక్కానీకి ఎక్కువ బలం ఉంటుంది. అయితే కొత్త ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారో తెలియదు. అఫ్గానిస్తాన్ లో 1996 నుంచి 2001 వరకు తాలిబాన్లు పరిపాలించారు. ఆ కాలాన్ని సంఘర్షణ స్థితిగా చెబుతారు. అప్పుడు తాలిబాన్లు ఎలా పరిపాలన చేస్తామనేది ప్రపంచానికి తెలపలేదు. ప్రస్తుతం తాలిబాన్లకు పరిపాలనలో పరిజ్ఞానం ఉన్నవారు, చట్టాలు తెలిసినవారు కావాల్సి ఉంటుంది. తాలిబాన్లలో ఆ పరిజ్ఞానం ఎవరికీ లేదు. గత ప్రభుత్వంలో పనిచేసినవారిని తమ ప్రభుత్వంలోకి తీసుకోబోమని చెప్పిన నేపథ్యంలో వారు ఎవరి సహాయం తీసుకుంటారు, అనుభవజ్ఞులను ఎక్కడి నుంచి తీసుకొస్తారో చూడాలి. చాలా దేశాలు తాలిబాన్ల ప్రభుత్వం ఎలా ఉండబోతోందో చూడాలని వేచి చూస్తున్నాయి. కొత్త 
ప్రభుత్వానికి అంతర్జాతీయంగా ఆమోదం లభిస్తేనే విదేశీ నిధులు వస్తాయి. అమెరికా, ఐఎంఎఫ్ నుంచి నిధులు ఆగిపోతే తాలిబాన్లు ప్రభుత్వం నడపడం కష్టం కావచ్చు. మరోవైపు అఫ్గానిస్తాన్ లోని నార్తర్న్ అలియన్స్ తాలిబాన్లకు ఎప్పుడూ లొంగలేదు. అక్కడ తిరుగుబాటును అంతం చేయడం వారి సాధ్యం కాదు. ఇది కూడా తాలిబాన్లకు సవాల్ గానే మారింది. దీంతో పాటు ఐసిస్-కే, అల్ ఖైదా లాంటి తీవ్రవాద సంస్థలతో ముప్పు ఎదురు కావచ్చు. ఇప్పుడు అఫ్గాన్ కు క్రమశిక్షణతో కూడిన ఒక శక్తివంతమైన సైన్యం కావాలి. ప్రజలను కాపాడేందుకు పోలీసు దళం కావాలి. వాటిని తాలిబాన్లు ఏమేరకు సమకూర్చుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: