కలాం : హి ఈజీ పీపుల్స్ ప్రెసిడెంట్

అబ్దుల్ కలాం... పరిచయం అక్కర లేని భారత రత్నం. క్షిపణి శాస్త్రవేత్త,  రక్షణ పరిశోధకుడు, భారతదేశపు మిసైల్ మ్యాన్ గా పేరుగాంచిన వ్యక్తి.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐస్రో)లో ఏరో స్పేస్ ఇంజనీర్ గా పని చేసిన వ్యక్తి. అన్నింటినీ మించి నిత్య విద్యార్థి.  అన్ని వయసుల వారికీ ఉపాధ్యాయుడు. భారత దేశానికి రాష్ట్రపతి గాసేవలందించిన మహోన్నత వ్యక్తి. ఈ రోజు భారతావని ఆయన జయంతిని జరుపుకుంటోంది. మాటలకందని మహామనీషి గురించి నాలుగు మాటలు.

భారత మాజీ ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ హయాంలో అబ్దుల్ కలాం కు భారత రత్న పురస్కారం లభించింది. 1998 మార్చి1న  భారతరత్న అవార్డు ప్రదానం  జరిగింది.  1952లో సి.వి.రామన్ కు భారత  రత్న లభించింది.  తర్వాత మరో సైంటిస్టును ఈ అవార్డు వరించలేదు. భారతరత్న అవార్డు స్వీకరించాక  కలాం ను అభినందించిన  తొలి వ్యక్తి అటల్‌ బిహారీ వాజ్‌పేయి.

ఇండియా టుడే గ్రూప్ పత్రికలలో సుధీర్ఘ కాలం పని చేసిన ప్రఖ్యాత జర్నలిస్ట్‌ రాజ్‌చెంగప్ప తన 'వెపన్స్ ఆఫ్ పీస్' పుస్తకంలో చాలా ఆసక్తి కరమైన విషయాలు రాశారు.  "ఓ సమావేశంలో  ఇందిరాగాంధీ అబ్దుల్‌ కలాంను అటల్‌ బిహారీ వాజ్‌పేయికి పరిచయం చేశారు.   వాజ్‌పేయి ఆయనకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండానే పరిచయం చేసుకున్నారు.  ఆ సమయంలో ఇందిరాగాంధీ తనదైన హాస్యం పండించారు.  వాజ్‌పేయివైపు చూసి "   అటల్జీ మీకు తెలుసా ?  కలాం ముస్లిం''  అని అన్నారు.  దీంతో వాజ్‌పేయి కూడా అంతే చమత్కారంతో బదులిచ్చారు. "అవును ముందు ఆయన భారతీయుడు, గొప్ప శాస్త్రవేత్త కూడా '' అని అన్నారు. దీంతో ఆ పరిసరాలలో నవ్వులు విరిశాయి.
వాజ్ పేయి రెండో సారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, తన మంత్రి వర్గంలో చేరమని అబ్దుల్ కలాం ను కోరారు. ఈ ఆహ్వానాన్ని కలాం సున్నితంగా తిరస్కరించారు. తనకు చాలా ముఖ్యమైన పనులున్నాయని సమాధానం ఇచ్చారు. ఇది జరిగిన రెండు నెలల తరువాత ప్రోఖ్రాన్ అణు పరీక్షలను భారత్  విజయవంతంగా నిర్వహించింది.  కలాం ఎందుకు మంత్రి పదవిని  స్వీకరించ లేదో అప్పుడు  వాజ్ పేయికి అర్థమైంది.
2002 జూలై  25 నుంచి 2007 జూలై 25 వరకూ  కలాం భారత దేశ ప్రథమ పౌరుడిగా దేశానికి సేవలందించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారు. కలాం సన్నిహితంగా ఉన్న ఎమ్.ఖాన్  ఒక  ఉదంతాన్ని ఎప్పుడూ చెప్పేవారు.  మొఘల్ గార్డెన్‌లో కలాం నడుస్తుండగా, ఒక నెమలి నోరు తెరవలేకపోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే రాష్ట్రపతి భవన్‌ వెటర్నరీ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ను పిలిచారు.  నెమలి వైపు చూపించారు. నెమలికి ఆరోగ్య పరీక్షలు చేయమని కోరారు. దీంతో ఆ డాక్టర్ నెమలిని పరీక్షించారు.  నోటిలో కణితి ఉందని, అందువల్ల ఆ పక్షి నోరు తెరవలేకపోతోందని తెలిపారు. రాష్ట్ర పతి ఆదేశాలతో డాక్టర్ సుధీర్‌ నెమలికి శస్త్రచికిత్స చేశారు. కణితిని తొలగించారు. కొన్ని రోజులు దానిని ఐసీయూలో ఉంచారు, ఆ తర్వాత  ఆ నెమలిని మొఘల్ గార్డెన్‌లో వదిలి పెట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోట తో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి షార్ సెంటర్ నుంచి జరిపిన పలు అంతరిక్ష ప్రయోగాలలో కలాం ప్రముఖ పాత్ర వహించారు. కలాం ఒక  సభలో ప్రసంగిస్తూ   తన  శ్రీ హరి కోట అనుభవాలను వివరించారు.  ఆ వీడియో శ్రీహరికోట చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో నేటికి కూడా వైరల్ అవుతోంది.  గత వారం ముగిసిన అంతరిక్ష వారోత్సవాలలోను కలాం  ను ఇస్రో స్మరించింది.

ఆయనలో మరో  పార్శం కూడా ఉంది.  కలాం సంగీత కారుడు. గొప్ప వైణికుడు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మికి భారత రత్వ ఇవ్వాలని ఆయనే ప్రతిపాదించారు. ఆయనే స్వయంగా ఆమెకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. తన తుది శ్వాస వరకూ ప్రజల కోసం, ముఖ్యంగా విద్యార్థుల కోసం, యవత శ్రేయస్సు కోసం పరితపించిన   కలాం ప్రజల రాష్ట్రపతి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: