తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ దళిత బంధు పేరుతో వచ్చే ఎన్నికల కోసం వ్యూహం సిద్ధం చేసి పెట్టారు. దాన్ని ప్రయోగాత్మకంగా హుజూరాబాద్‌లో ప్రయోగించారు. అఫ్‌ కోర్స్.. ఎన్నికల సంఘం దాన్ని ఆపేయాలని చెప్పిందనుకోండి. కానీ.. ఆ ప్రభావం అయితే లేకుండా పోదు కదా. అందుకే మచ్చుకు కొందరికి ఇప్పటికే రూ.10లక్షల నగదు పంపిణీ, పథకాల ప్రారంభం కూడా చేశారు.


అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 2 న వెలువడబోతోంది. అదే నవంబర్‌లో తెలంగాణలో మరో కీలకమైన సభ జరగబోతోంది. ఆ తర్వాత డిసెంబర్‌లో మరో కీలకమైన సభ జరగబోతోంది. అంటే వచ్చే రెండు నెలల్లో రెండు కీలకమైన రాజకీయ సభలు జరగబోతున్నాయి. అవేంటంటే.. నవంబర్ 15న టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ నిర్వహించబోతోంది. ఇక డిసెంబర్‌ 9 కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించబోతోంది. అయితే.. ఈ రెండు సభలే తెలంగాణ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.


అసలు కాంగ్రెస్ ఇటీవల నిర్వహిస్తున్న సభలు,సమావేశాలతోనే కేసీఆర్ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9 న కేసీఆర్ సభకు మించి కాంగ్రెస్ సభ ఉంటుందని సవాల్ చేస్తున్నారు. ఈ సభలే తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలను మార్చబోతున్నాయని ధీమాగా చెబుతున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అని..  అందుకే  ఆయన నవంబరు15న సభ పెట్టాడని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే తన లక్కీ నెంబర్ 9 అనీ.. అందుకే డిసెంబర్ 9 న సభ నిర్వహిస్తున్నానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.


అంతే కాదు.. ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో తెరాసకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ రెడ్డి నొక్కివక్కాణిస్తున్నారు. మరి ఈ రెండు సభలు ఏ రేంజ్‌లో జరుగుతాయో చూద్దాం.. దాన్ని బట్టి తెలంగాణ భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుందో ఓ అంచనాకు వద్దాం.. ఏమంటారు.?

మరింత సమాచారం తెలుసుకోండి: