తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి అంశంపై టీడీపీ వద్ద సీసీ ఫుటేజ్‌ కూడా ఉంది. అసలు ఈ దాడి జరగక ముందే.. అనుమానంతో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి ఫోన్ కూడా చేశారని చెబుతున్నారు. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత దాడి జరిగింది. పార్టీ కేంద్ర ఆఫీసులోకి వచ్చిన కొందరు దుండగులు.. పార్టీలోని ఫర్నచర్‌ను ధ్వంసం చేశారు. దీనిపై టీడీపీ కార్యాలయ సిబ్బంది అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయితే.. టీడీపీ ఫిర్యాదుపై ఇప్పటి వరకూ కేసు నమోదు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ అంశంపై న్యాయ పోరాటం చేయాలని టీడీపీ భావిస్తోందట. ఘటన జరిగి రెండు రోజులు జరుగుతున్నా ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టబోమంటున్న టీడీపీ దీనిపై కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి తోడు దాడి జరిగిన రోజు రాత్రి ఓ పోలీస్‌ అధికారి మఫ్టీలో టీడీపీ కార్యాలయానికి వచ్చారు.


సదరు కానిస్టేబుల్‌ను టీడీపీ కార్యాలయ సిబ్బంది నిర్బంధించి కొట్టారని ఫిర్యాదు దాఖలైంది. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు  ఈ కేసు దాఖలైంది. ఇందులో ఏకంగా హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లు కూడా పెట్టి కేసు నమోదు చేశారు. మరి అసలు జరిగిన ఘటనపై ఇంత వరకూ ఎందుకు కేసు నమోదు చేయలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


వాస్తవానికి ఇప్పటి వరకూ నిజంగానే కేసు నమోదు చేయకపోతే.. టీడీపీ కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి అక్షింతలు తప్పవు. ఏదైనా నేరం జరిగినప్పుడు.. దానికి సంబంధించి ఫిర్యాదు ఉన్నప్పుడు.. సీసీ ఫుటేజ్ ఉన్నప్పుడు కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడాన్ని కోర్టులు సహించవు. అందువల్ల  ప్రభుత్వం తీరును తీవ్రంగా కోర్టు తప్పుబట్టే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ రాజకీయ యుద్ధంలో టీడీపీది పైచేయిగా మారే అవకాశం ఉంది. చూడాలి. ఏంజరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: