ఇప్పటికే నిధుల సమస్యతో ఇబ్బంది పడుతున్న ఏపీ సర్కారుకు ఇప్పుడు మరో చిక్కు వచ్చిపడింది. ఏపీ సర్కారు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టిస్తోందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీల కోసం 15వ ఆర్థిక సంఘం కింద కేంద్రం ఇచ్చిన నిధుల్ని సైతం ప్రభుత్వం దారి మళ్లించిందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మాటలు ఏదో ప్రతిపక్ష నేతలు అంటే.. రాజకీయ విమర్శలుగా భావించొచ్చు.. కానీ సొంత పార్టీకి చెందిన సర్పంచులు సైతం జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.


జగన్ సర్కారు గ్రామాల కోసం విడుదల చేసిన నిధులను సైతం పక్కదారి పట్టించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని  వైసీపీ సర్పంచులే వాపోతున్నారు. కడప జిల్లాలో సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది వరకూ సర్పంచ్‌లు పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. మౌళిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటికి కేంద్రం కేటాయించిన నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందని ారు ఆరోపిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13, 400 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అనేక చోట్ల సర్పంచులు  సొంత నిధులతో పనులు చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో తీసుకోవచ్చని పనులు చేయించారు. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్రం లాగేసుకుందని వారు చెబుతున్నారు. తమ  నిధులు మళ్లిస్తే పంచాయతీల్లో పనులెలా చేయించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన బిల్లుల్నిరాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే దారి మళ్లించిందంటున్నారు. ఇప్పుడు కాదు అంతకుముందు 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని కూడా పాత బకాయిల కింద తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడీ సర్పంచుల ఉద్యమం రాష్ట్రవ్యాప్తం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి దీనికి వైసీపీ సర్కారు ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: