ఏపీ రాజధాని ఏది.. ఇది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయ్యింది. చంద్రబాబు ప్రారంభించిన అమరావతిని నేను కొనసాగించడం ఎందుకు అనుకున్న జగన్.. రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. ఊరికే రాజధాని మారిస్తే ఏం బావుంటుందనుకున్నారో ఏమో.. దానికి వికేంద్రీకరణ అనే కోణం జోడించి మూడు రాజధానుల ఐడియా తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని సంతృప్తిపరిచేలా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఈ మూడు రాజధానుల బిల్లును సక్రమంగా ఆమోదింపజేసుకోవడం జగన్ సర్కారుకు వీలు కాలేదు.


దీనికి తోడు ఈ మూడు రాజధానుల బిల్లు అమలుకు కోర్టుల్లోనూ అడ్డంకులు ఎదురయ్యాయి. కోర్టు మూడు రాజధానుల బిల్లు కేసును చాలా కాలం  పెండింగ్‌లో పెట్టేసింది. దీంతో ఏపీ రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. అమరావతి అనేది రాజధానిగా ఉన్నా సీఎంకు ఇష్టం లేదు కాబట్టి అది రాజధాని కాదు.. విశాఖను కొత్త రాజధానిగా ప్రకటించినా అది అమల్లోకి రాలేదు కాబట్టి విశాఖ రాజధాని కాదు. కర్నూలుకు హైకోర్టు తరలింపు జరగలేదు కాబట్టి కర్నూలు న్యాయ రాజధాని కాదు.. మరి ఏదీ ఏపీ రాజధాని.. ఇప్పుడు ఇదే సమాధానం లేని ప్రశ్నగా మారింది.


ఈ పరిస్థితిపై తన తాజా ఎడిటోరియల్‌లో తీవ్రంగా మండిపడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. దీనిపై ఓ సెటైర్ వేశారు. రాజధాని నిర్మాణం ఈ జగన్ వల్ల అయ్యే పనిలా కనిపించడం లేదంటున్న ఆర్కే.. ఇందుకు ఓ ఐడియా కూడా సూచించారు. తిరుపతి నుంచి విశాఖ వరకు ఒక రైలును ప్రారంభించి అందులోనే రాజధాని ఉంటుందని ప్రకటిస్తే ఏ గొడవా ఉండదని ఐడియా ఇచ్చారు.


ఈ రైలు వచ్చినప్పుడు..  ఎవరికి వారు తమ ఊరికే రాజధాని వచ్చిందని మురిసిపోవచ్చని వెటకారం ఆడారు. ఈ రైలు ఐడియా మలు చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవదని సూచిస్తున్నారు ఆర్కే. ప్రభుత్వానికి పద్ధతీ పాడూ లేకుండా పోతే ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు అలాగే ఉందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విమర్శిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: