సీఎం జగన్ కదిలాడు.. ఇటీవల వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ వాసులను పరామర్శించేందుకు జగన్ కదిలాడు.. ఎంతో ఇష్టంగా గెలిపించుకున్నాం.. ఇంత కష్టంలోనూ మమ్మల్ని జగన్‌ ఆదుకోడా.. అని ఆక్రోశించిన వారిని పరామర్శించేందుకు జగన్ కదిలాడు.. ముఖ్యమంత్రి సీఎం జగన్ ఇవాళ, రేపు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో వరద బాధిత ప్రాంతాలను సందర్శిస్తారు.


అయితే ఇప్పటికే జగన్ ఒకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.. అంటే గాల్లోనే హెలికాప్టర్‌ను వరద ప్రాంతాలను చూడటం అన్నమాట. అయితే.. సీఎం గాల్లోనే తిరుగుతారా.. నేలకు దిగరా అంటూ విపక్షాలు విమర్శించాయి. అంతే కాదు.. విపక్ష నేత చంద్రబాబు వరదలు వచ్చిన రెండు, మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బురదలో తిరిగారు.. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ తీరుపై విమర్శలు వచ్చాయి. దీనికితోడు వరదల సమయంలోనే సీఎం జగన్ హైదరాబాద్‌లోని ఓ పెళ్లికి హాజరుకావడం కూడా విమర్శలకు తావిచ్చింది.


సీఎం పెళ్లికి వెళ్లడం తప్పేమీ కాదు.. కానీ.. వరదల సమయంలో ప్రజలను పరామర్శించడం కూడా ముఖ్యమంత్రి బాధ్యతే. అబ్బే నేను వెళ్తే ఏమవుతుంది.. యంత్రాంగం అంతా నా వెంట తిరుగుతుంది.. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది.. అని వాదించడం సబబుగా కనిపించదు. సాక్షాత్తూ సీఎం వచ్చారంటే.. ప్రజలకు కాస్త భరోసా ఉంటుంది. అధికారుల్లో అలర్ట్ నెస్‌ పెరుగుతుంది. సీరియస్ నెస్ వస్తుంది. అందుకే.. ఈ విషయం వివాదాస్పదం అయ్యింది. అయితే మొదట్లో అడ్డంగా వాదించిన వైసీపీ నేతలు విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు సీఎం జగన్ కదిలారు. జనం గోడు వింటామంటున్నారు. మంచిదే.. నష్టపోయిన ప్రజలను పరామర్శించాలి. పరిహారం, సాయం అందే విషయంలో మరింతగా దృష్టి పెట్టాలి. ఇదే జనం కోరుకునేది.

మరింత సమాచారం తెలుసుకోండి: