ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్.. మాజీ ఐపీఎస్ ఆఫీసర్.. ప్రస్తుతం బీఎస్పీలో చేరారు. ఆయన తన సర్వీసు ఇంకా మిగిలి ఉండగానే పదవికి రాజీనామా చేయడంతో మొదట్లో అనేక ఊహాగానాలు వచ్చాయి. ఆయన ఏ పార్టీలో చేరతారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన బీఎస్పీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయన రాజకీయ అరంగేట్ర సభ కూడా నల్గొండలో భారీగానే సాగింది. బహుశా బీఎస్పీకి సంబంధించినంత వరకూ ఇదే అతి  పెద్ద సభ అయి ఉండొచ్చు.


ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక మంది ప్రముఖులు, మేధావులు, రచయితలను కలుస్తున్నారు. వారితో తన భావాలు పంచుకుంటున్నారు. అయితే.. మరి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఏమేరకు ప్రభావం చూపుతారు.. ఆయన చేరిన బీఎస్సీకి తెలంగాణలో పెద్దగా కార్యకర్తల బలం లేదు.. అసలు ఆర్‌ఎస్‌పీ బీఎస్పీలో చేరకుండా సొంత పార్టీ పెడితే మేలని కొందరు ఆయన అభిమానులు కూడా భావించారు. కానీ.. ప్రవీణ్ కుమార్ మాత్రం బీఎస్పీలో చేరారు.


ఇప్పుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నార్కట్‌పల్లి వరి కల్లంలో హమాలీ పని చేశారు. బస్తాలు మోసి 100 రూపాయలు సంపాదించానని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఆయనకు వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉంది. అందులోనూ ఎస్సీల్లోని విద్యావంతుల్లో ప్రవీణ్ కుమార్‌ సార్ అంటే చాలా గౌరవ భావం ఉంది. కానీ.. ఇది రాజకీయాల్లో ఏమేరకు కలసి వస్తుందనేది ఆలోచించాల్సిన విషయమే. బీఎస్పీ వంటి పార్టీలో ఉండి ప్రవీణ్ కుమార్.. ఎన్నికల్లో గెలవగలరా.. తన పార్టీని గెలిపించగలరా.. అన్నది ఆలోచించాల్సిన విషయమే.


ఇప్పటికే తెలంగాణలో రాజకీయంగా చాలా పోటీ ఉంది. అధికార టీఆర్‌ఎస్‌కు ఎదురులేని పరిస్థితి ఉంది. దీనికితోడు సెకండ్ ప్లేస్ కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమేరకు విజయ సాధిస్తారో చూడాలి.. లేదా ఆయన కూడా ఓ జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణగా మిగిలిపోతారా.. ఏమో కాలం సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rsp