ప్రస్తత రాజకీయాలలో కురువృద్ధుడు, మాజీ కేంద్ర మంత్రి, ఎన్ సి పి అధినేత శరద్ పవార్ తో సమావేశమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  తనకు ఇంతటి భారీ మద్దతు లభిస్తుందని ఊహించి ఉండక పోవచ్చు. ఆమెకు మద్దతు ఎన్.సిపి నుంచి  కాకుండా , తమ మాజీ సహచరుడు, కాశ్మీర్ రాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ నుంచి వచ్చింది. ఊహించని ఈ పరిణామానికి ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యారు . మూడు రోజుల ముంబాయి పర్యటనలో భాగంగా ఆమె ఎన్.సి.పి అధినేత శరత్ పవార్ తో సమావేశమయ్యారు. ఆ తరువాత విలేఖరులతో సంభాషించారు.

దశాబ్దాల పాటు భారత్ ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఏ) పై కీలక మైన విమర్శలు చేశారు యుపిఏ అస్తిత్వం పై విలేఖరులకే ప్రశ్నలు సంధించారు. యుపిఏ కూటమా ... అదెక్కడుంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా  తన ఇంటిని తాను చక్కబెట్టుకోవాలని సలహా కూడా ఇచ్చారు. ఇది రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరచ లేదు. ఎందుకంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖుర్గే నిర్వహించిన విపక్షాల సమావేశానికి తృణముల్ కాంగ్రెస్ నేతలు ఎవరూ హజరు కాలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ తో దూరం పాటించనున్నట్లు చెప్పకనే చెప్పారు. ఆ తరువాత ఎన్.సిపి అధినేత శరద్ పవార్,  ఆయన మిత్రపక్షంగా ఉన్న శివసేన నేతల మద్దతు కూడగట్టేందుకు ముంబయి పర్యటనకు వచ్చారు.
అదే సమయంలో కాశ్మీర్ రాష్ట్రం పూంచ్ లో  నిర్వహించిన ఒక ర్యాలీ లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ ప్రసంగిస్తున్నారు. కాశ్మీర్ రాష్ట్రానికి మునుపటి హోదా ఇవ్వాలనే డిమాండ్  ఆయన ఆ సభలో గట్టిగా వినిపించారు. అంతే కాకండా, ..తాను ఇప్పటికీ కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు సంధించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి విజయావకాశాలు లేవని స్పష్టంగా తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలుస్తుందని తాను భావించడం లేదని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలు కైవశం చేసుకోవాలని తాను భగవంతుడ్ని ప్రార్థిస్తాను.... కాని విజయం సాధిస్తామని నేను అనుకోవడం లేదు అంటు తన అభిప్రాయాన్ని సభాముఖంగానే ప్రకటించారు గులాంనబీ అజాద్.
మమతా బెనర్జీ గతంలో కాంగ్రెస్ లో కీలక భూమిక పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తరువాత  స్వంతంగా తృణముల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.  గులాం నబీ అజాద్  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. కాశ్మీర్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. వీరిద్దరి  మధ్య దశాబ్దాలుగా స్నహ సంబంధాలున్నాయి. అజాద్ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ లో అసమ్మతి వాదిగా కూడా పేరుపడ్డారు.  ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరి నేతల వ్యాఖలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: