ఓవైపు ప్రపంచం మొత్తం మరోసారి కరోనా వేవ్ తప్పదేమోనని భయపడుతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సమయోచితమైన నిర్ణయం తీసుకున్నారు. 15 నుంచి 18 ఏళ్లు ఉన్నవారికి జవనరి 3 నుంచి టీకా పంపిణీ చేస్తామని ప్రధాని ప్రకటించారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు శ్రమిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లుకు బూస్టర్ డోస్ ఇస్తామని తెలిపారు. జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు టీకా ఇస్తామని ప్రకటించేశారు. అంతే కాదు.. 60 ఏళ్లు పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోసు ఇస్తామని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.


ప్రధాని మోడీ చేసిన ప్రకటనలు స్వాగతించేలా ఉన్నాయి.  గతంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో తగినంత ముందు జాగ్రత్త లేక.. వేల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ముందుస్తు ప్రణాళిక లేకుండా పెట్టిన లాక్‌ డౌన్ల కారణంగా లక్షల మంది వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వలస కార్మికులు వేల మంది కాలినడకన సొంతూళ్లకు బయలుదేరిన దృశ్యాలు కంటనీరు పెట్టించాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రధాని మోడీ సర్కారు బాగా విమర్శల పాలైంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో కనీసం ఆక్సిజన్ సిలండర్లు లేక వందల ప్రాణాలు గాల్లో కలిశాయి.


కరోనా తీవ్రతపై సమచారం ఉన్నా కేంద్రం సరిగ్గా స్పందంచలేదన్న విమర్శలు అప్పట్లో మీడియాలో బాగా వచ్చాయి. అందుకేనేమో ఈసారి ఒమిక్రాన్ విషయంలో ప్రధాని మోడీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో ఒమక్రాన్ కేసులు వందల సంఖ్యలోనే ఉన్నప్పటికీ భారీగ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ముందు 15-18 మధ్య వయస్సున్న వారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించారు.


అంతే కాదు.. గతంలో ఫ్రంట్‌ లైన్ వర్కర్లు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ముందు చూపుతో వారికి ఇప్పడు బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలని మోదీ సర్కారు నిర్ణయించింది. సాధారణంగా కరోనా అనేది ఒక రోగం కాదు. కానీ అది వస్తే.. శరీరంలోని ఊపిరితిత్తులు వంటి వాటిపై తీవ్రప్రభావం చూపుతుంది. అందుకే వయో వృద్ధులకు కూడా బూస్టర్‌ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. రేపు ఒమిక్రాన్ విశ్వరూపం చూపినా ప్రాణనష్టం జరగకుండా ఉండాలన్న లక్ష్యంతో మోడీ సర్కారు ఈసారి ముందు చూపు ప్రదర్శించిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: