టీడీపీ నేత వంగవీటి రాధా మరోసారి పార్టీ మారబోతున్నారా.. ఆయన మళ్లీ వైసీపీలో చేరబోతున్నారా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే వంగవీటి రాధా చూపు వైసీపీ వైపు ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చారు. అయితే..  ఇటీవల కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో మంత్రి, వల్లభనేని వంశీ పాల్గొన్నప్పుడే అనేక గుసగుసలు వినిపించాయి. అయితే అదే రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తనపై రెక్కీ జరిగిందని వంగవీటి రాధ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఫోకస్ అంతా ఆ అంశంపైకి వెళ్లింది. ఆ తర్వాత వంగవీటి రాధా ప్రకటనపై జోరుగా ఊహాగానాలు వచ్చాయి. అయితే.. తాజాగా జరిగిన మరో పరిణామం చూస్తే వంగవీటి రాధా వైసీపీ వైపు చూస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.


వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారన్న ఆరోపణపై వైసీపీ సర్కారు స్పందించిన తీరు చూస్తే.. ఆయనపై ప్రత్యేక అభిమానం చూపుతున్నట్టు కనిపిస్తోంది. వంగవీటి రాధా ఆరోపణలపై సీఎం జగన్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అంతే కాదు.. రాధా కోరితే ప్రత్యేకమైన భద్రత కల్పించాలని ఆదేశించారు. వంగవీటి రాధా ప్రాణానికి ఎలాంటి హాని జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.


ఈ పరిణామాలు చూస్తే వంగవీటి రాధా వైసీపీలో చేరతారేమో అన్న అనుమానాలు కలుగక మానవు. అయితే.. వైసీపీ లోకి వస్తానని రాధా మాతో  చెప్పలేదని.. మేమూ ఆహ్వానించలేదని మంత్రి కొడాలి నాని అంటున్నారు. వైసీపీలోకి రావాలని వంగవీటి రాధా అనుకుంటే ఆయనే చెబుతారని.. ఒకవేళ ఆయన చెబితే  మేము దీనిపై అప్పుడు సీఎంతో  మాట్లాడతామని నాని క్లారిటీ ఇచ్చారు. తమను విగ్రహాఆవిష్కరణకు పిలిస్తే వెళ్లామని.. దీనికి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత లేదని మంత్రి అంటున్నారు. అయితే కొడాలి నాని అలా అంటున్నా.. సీన్ చూస్తే మాత్రం వంగవీటి మొగ్గు వైసీపీ వైపే అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: