తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ ప్రశ్న సంధించారు.. పేద రాష్ట్రంగా పేరున్న ఝార్ఖండ్  బీపీఎల్‌ కింద ఉన్న వాహనదారుల కోసం  పెట్రోల్ ధర రూ.25 తగ్గించింది.. కానీ.. కేసీఆర్‌ పైసా కూడా తగ్గించను అంటున్నారని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెబుతుంటారు కదా.. మరి ఇప్పుడు ఏమైంది.. రాష్ట్ర ఖజానా దివాలా తీసిందా..? అని ప్రశ్నించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఖజానా దివాలా తీయకపోతే.. ప్రజలను పన్ను పోటుతో వేధించడం పైశాచిక ఆనందమా? అని కూడా రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


రేవంత్ రెడ్డి అడిగారని కాదు.. కానీ.. నిజంగా ఈ ప్రశ్న సహేతుకమైనదే.. పెట్రోల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. మన దేశంలో పెట్రోల్ రేట్లు అందరికీ ఒకటే. సామాన్యుడైనా.. ధనవంతుడైనా ఒకటే పెట్రోల్‌ బంకులో పెట్రోల్ కొట్టించుకోవాలి.. లూనా పై చిరు వ్యాపారం చేసుకునే సామాన్యుడైనా.. బెంజ్‌ కారు తోలే ధనవంతుడైనా అదే పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ కొట్టించుకోవాలి. ధనవంతుడికి వచ్చిన ఇబ్బంది లేదు.. మరి సెంచరీ స్కోరు దాటుతున్న పెట్రోల్‌ రేట్లు సామాన్యుడు ఎలా భరించగలడు..?


దీనికి ప్రభుత్వాలు చెప్పే సమాధానం ఏంటి.. కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచింది. అందులో కాస్త తగ్గించి ఇప్పుడు ఫోజు కొడుతోంది. పెట్రోల్ రేట్లు తగ్గాలంటే కేంద్రం తన పన్నులు తగ్గించుకోవాల్సిందే వేరే మార్గం లేదు అంటున్నారు. ఆ మేరకు కేంద్రం కాస్త కనికరించింది. అయినా సరే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు వందపైనే ఉంది. మరి ఇలాంటి సమయాల్లో రేషన్ కార్డు ఉన్న వాహనదారులకు మాత్రం పెట్రోల్ రేటుపై పాతిక రూపాయలు తగ్గించాలని ఝార్ఖండ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం భేష్ అని మెచ్చుకోకతప్పదు. అది కూడా నగదు బదిలీ చేస్తానని ఝార్ఖండ్‌ చెబుతోంది.


మరి నిజంగానే ధనిక రాష్ట్రం అని చెప్పుకునే కేసీఆర్ ఎందుకు ఇలాంటి ఆలోచన చేయడం లేదు. వంద ఎకరాలు ఉన్న ఆసామికి కూడా ఉదారంగా రైతు బంధు ఇచ్చే కేసీఆర్ ఎందుకు పెట్రోల్ ధరలతో మగ్గిపోతున్న సామాన్యుడి గోడు పట్టించుకోడు..? న్యాయమైన ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందా..?


 

మరింత సమాచారం తెలుసుకోండి: