కాంగ్రెస్‌ పార్టీ ఓ విచిత్రమైన పార్టీ.. ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకుంటారు.  సహజంగానే జాతీయ పార్టీ అయినందువల్ల కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలో తీసుకుంటారు. అందువల్ల ప్రాంతీయ స్థాయిలో ప్రతి ఒక్క నేత కూడా తన గళం బలంగా వినిపిస్తారు.. హైకమాండ్‌ దగ్గర తప్ప అన్ని చోట్లా అన్నిస్థాయిలో కాంగ్రెస్ నాయకులు గళం ఎత్తుతారు.. ఇష్టారీతిన మాట్లాడతారు.. అందేమంటే అదంతే.. మా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటుంటారు. అయితే ఎన్ని అవలక్షణాలు ఉన్నా.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం కాంగ్రెస్సే.


సీఎం కేసీఆర్‌ జోరును అడ్డుకునేందుకు చివరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి తెచ్చుకుని మరీ ప్రయోగం చేస్తోంది. రేవంత్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు సీరియస్‌గానే చేస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాత్రం అందరు నేతలనూ డీల్ చేయలేకపోతున్నారు. సాధ్యమైనంత వరకూ పెద్దరికం తెచ్చుకుని ప్రతినాయకుడి ఇంటికి వెళ్లి మరీ పలకరించి పార్టీలో తనకు అడ్డం రాకుండా సీనియర్లను బాగానే దారికి తెచ్చుకుంటున్నాడు.


అయితే.. ఈ రేవంత్ రెడ్డికి కొన్ని కొరకరాని కొయ్యలు ఉన్నాయి. ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఓ జగ్గారెడ్డి వంటి వారు మాత్రం రేవంత్‌కు అంత సులభంగా కొరుకుడుపడటం లేదు. ఇప్పుడు జగ్గారెడ్డి అయితే.. ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాసి రేవంత్ పై ఫిర్యాదు చేశాడు. ఈ రేవంత్ రెడ్డి వేస్టు.. ఆయన వల్ల ఏం కాదు.. ఆయన అందరనీ కలుపుకుపోవడం లేదు.. ఈయన్ని పీకేసి.. ఇంకెవర్నైనా పీసీపీ చీఫ్‌ను చేయండి అని జగ్గా రెడ్డి లేఖ రాసేసారు.


ఇప్పుడు ఆ లేఖ కారణంగా జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుందామని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో మరింత రెచ్చిపోయిన జగ్గారెడ్డి అసలు పీసీసీ ప్రెసిడెంట్‌కు క్రమశిక్షణ వర్తించదా.. నా అనుమతి లేకుండా నా ప్రాంతంలో కార్యక్రమం ఎలా చేపడతారని ఎదురుదాడి ప్రారంభించాడు జగ్గారెడ్డి. అబ్బే.. ఈ గొడవ ఇప్పట్లో తెమిలేలా లేదు. మొత్తాని ఇలాంటి సీనియర్లను డీల్ చేయాల్సి రావడం పాపం.. రేవంత్ కు తలకుమించిన పనే.

మరింత సమాచారం తెలుసుకోండి: