ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు. ఆ మేరకు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు బడ్జెట్‌ భారీగా కేటాయించి పూర్తి చేశారు. ఇప్పుడు కేసీఆర్ సర్కారు ఐటీ రంగంపైనా ఫుల్‌గా ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఐటీ విషయంలో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్ వంటి మల్టీ నేషనల్‌ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి.


అయితే.. కేవలం హైదరాబాద్‌ ఒక్కటే ఐటీ చిరునామాగా ఎందుకు ఉండాలి.. ఐటీని జిల్లా కేంద్రాలకు కూడా ఎందుకు తీసుకెళ్ల కూడదన్న ఆలోచనతో కేసీఆర్ సర్కారు జిల్లాల్లోనూ ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసింది. వీటిలో కార్యకలాపాలు ఆశావాహంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి ఖమ్మం ఐటీ హబ్‌కు మంచి పేరు వచ్చింది.


అందుకే ఈ ఐటీ హబ్‌ కాన్సెప్టులు ఇప్పుడు కేటీఆర్‌ అన్ని జిల్లాలకూ విస్తరిస్తున్నారు. తాజాగా నల్గొండలోనూ ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేశారు. ఐటీ సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలన్నదే కేసీఆర్ లక్ష్యం అంటున్న కేటీఆర్‌.. నల్గొండ పిల్లలకు కొలువులు వచ్చేలా ఐటీ హబ్ ను తీర్చిదిద్దుతామంటున్నారు. అంతే కాదు.. నల్గొండలో నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నల్గొండ ఐటీ హబ్‌లో స్టార్టప్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని.. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు.


ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఇంటి నుంచే ఏ సంస్థలోనైనా పని చేసే అవకాశం వచ్చింది. ఇంటర్‌నెట్ ఉంటే చాలు ఎక్కడ నుంచి అయినా పని చేయొచ్చు. ఈ సౌలభ్యాన్ని అందుకుని మారుమూల ప్రాంతాలకూ ఐటీ ఫలాలు తీసుకెళ్లాలన్న కేటీఆర్ కల సాకారం కావాలి.. అన్ని జిల్లాల్లోనూ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఈ కొత్త ఏడాది కొత్త ఉపాధి అవకాశాలు కలగాలి. హ్యాపీ న్యూ ఇయర్.

మరింత సమాచారం తెలుసుకోండి: