బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి నిరసనగా బీజేపీ నిర్వహించే నిరసన ర్యాలీలో పాల్గోవాలని జేపీ నడ్డా ముందుగా నిర్ణయించుకున్నారు. ఆర్ఎస్‌ ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డా.. ఒకరోజు ముందే వచ్చి.. పార్టీ నిర్వహిస్తున్న నిరసన ర్యాలీలో పాల్గోవాలని నిర్ణయించారు. అయితే.. నడ్డా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెగేసి చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది.


మొన్నటికి మొన్న కేవలం కరోనా నిబంధనలు పాటించలేదన్న కారణంతోనే బండి సంజయ్‌ను పోలీసులు తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేసి జైల్లో పడేశారు. బండి సంజయ్‌పై పదికి పైగా కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేశారు. ఇప్పుడు ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన జేపీ నడ్డాకు  కూడా ఇదే కరోనా నిబంధనల సాకుతో అరెస్టులు, హంగామా జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చింది. అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపే సాహసం చేస్తారా అన్న అనుమానం కూడా లేకపోలేదు.


అయితే.. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పెట్టిన ఓ ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చకు దారి తీసింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని ఫోకస్ చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని రేవంత్ రెడ్డి తన ట్వీట్‌లో ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయన్న రేవంత్ రెడ్డి.. బండి సంజయ్‌ అరెస్టు అంశం ఆ నాటకంలో తొలి అంకం అంటూ విమర్శించారు. ఇప్పుడు చూడండి.. ఇవాళ జేపీ నడ్డాను కూడా అరెస్టు చేస్తారు.. బీజేపీ, టీఆర్ఎస్ డ్రామా కొనసాగుతుంది.. కావాలంటే చూడండి.. అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ పెట్టారు.


మరి రేవంత్ రెడ్డి ట్వీట్ ప్రభావమో.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడితో ఎందుకులే అనో.. మొత్తానికి జేపీ నడ్డాను అరెస్టు చేయడం కానీ.. అడ్డుకోవడం కానీ చేయలేదు. దీంతో ఆయన ప్రశాంతంగా సికింద్రాబాద్‌ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇదంతా చూస్తే నడ్డాను కాపాడింది రేవంత్ రెడ్డి ట్వీటేనేమో అనిపించడం లేదూ..?


 

మరింత సమాచారం తెలుసుకోండి: