పంజాబ్‌లో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి ఊహించ‌నివిధంగా ఆ రాష్ట్ర రైతుల‌ నిర‌స‌న‌ల సెగ త‌గ‌ల‌డంతో ఆయ‌న ఆ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుని వెన‌క్కు వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ ఘ‌ట‌న దేశంలో ఢిల్లీ స్థాయిలో రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. రోడ్డు మార్గాన వెళుతున్న స‌మ‌యంలో ప్ర‌ధానికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని బీజేపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. ఒక‌ప‌క్క దీనిపై బీజేపీ నేత‌లు పంజాబ్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సుప్రీం కోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. మ‌రోప‌క్క కేంద్ర హోంశాఖ ఈ ఘ‌ట‌న‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. చ‌ర‌ణ్‌జీత్ చ‌న్నీ ప్ర‌భుత్వం దీనికి త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దంటూ హోం మంత్రి అమిత్‌షా హూంక‌రిస్తున్నారు. మోదీ ప్ర‌ధానిగా ఉన్న ఈ ఏడేళ్ల కాలంలో ఆయ‌న‌కు ఇలాంటి ఘ‌ట‌న ఎదుర‌వ‌డం ఇదే మొద‌టిసారి. దాంతో మోదీ దీనిపై త‌న ఆగ్ర‌హాన్ని ఏమాత్రం దాచుకోలేదు. అయితే పంజాబ్ ముఖ్య‌మంత్రి చ‌న్నీతోపాటు కాంగ్రెస్ నేత‌లు ఇదంతా మోదీ ఎన్నిక‌ల స్టంటంటూ కొట్టిపారేస్తున్నారు. ఇది మోదీకి మ‌రింత మంట పుట్టించే అంశ‌మే.

ఇదిలా ఉండ‌గా తాన‌నుకున్న అంశంపై ఎవ‌రేమ‌నుకున్నాధైర్యంగా మాట్లాడుతూ త‌న ప్ర‌త్యేక‌తను చాటుకునే బాలీవుడ్ క‌థానాయిక కంగ‌నా రనౌత్ ఈ అంశంపై త‌నదైన శైలిలో ఘాటుగా స్పందించారు. పంజాబ్ లో బుధ‌వారం ప్ర‌ధానికి జ‌రిగిన ఘ‌ట‌న సిగ్గుచేట‌ని, 140 కోట్ల‌మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధిగా ఉన్న వ్య‌క్తిపై దాడి చేయ‌డ‌మంటే దేశ‌ప్ర‌జ‌లంద‌రి పైనా దాడి చేసిన‌ట్టేన‌ని, దీనికి బాధ్య‌త‌ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానిదేనంటూ కంగ‌నా ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఆమె అంత‌టితో ఆగ‌లేదు. పంజాబ్ ఉగ్ర‌వాద‌ కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా మారుతోంద‌ని, వాటిని వెంట‌నే అరిక‌ట్ట‌క‌పోతే దేశం దానికి మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దంటూ ట్వ‌ట్ట‌ర్ లో వ్యాఖ్యానించి ఈ వివాదాన్ని మ‌రో కోణం లోకి తీసుకెళ్లారు. భార‌త్ స్టాండ్స్ విత్ మోదీజీ అంటూ ఆమె హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టారు. కంగ‌నా తన‌కు ఏ పార్టీతోనూ సంబంధం లేద‌ని పైకి చెబుతూనే జాతీయ‌వాదంతో ముందుకు వెళ్లే పార్టీల కోసం ప్ర‌చారం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంటే ఆమె తాను బీజేపీకి అనుకూల‌మ‌ని ప‌రోక్షంగా చెప్నిన‌ట్టే. ఇప్ప‌టికే ప‌లుసార్లు ఆమె బీజేపీకి అనుకూలంగా మాట్లాడ‌టం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఆమె బీజేపీ త‌ర‌పున స‌మీప భ‌విష్య‌త్తులోనే ఎన్నిక‌ల గోదాలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చ‌ని రాజ‌కీయ వర్గాలంటున్నాయి. ఇప్పుడు మోదీకి బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారుగా నిలిచి ఆయ‌న దృష్టిని ఆక‌ర్షించిన ఆమె రాబోయే కాలంలో కేంద్ర‌మంత్రి అయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదేమో..!   ఎందుకంటే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై దూకుడుగా పోరాటం చేసిన‌ స్మృతి ఇరానీ, త‌న విధేయ‌త‌తో నిర్మ‌లా సీతారామ‌న్ మోదీషాల‌ను మెప్పించి కేంద్ర‌మంత్రులు కాగా వెండితెర క‌థానాయిక‌గా తిరుగులేని చ‌రిష్మా ఉన్న కంగ‌నా కు అదేమైనా సాధ్యం కాని విష‌య‌మా..?

మరింత సమాచారం తెలుసుకోండి: