ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ తర్వాత ఎన్నికలు జరుగుతున్న అది పెద్ద రాష్ట్రం పంజాబ్‌.. ఇక్కడ అసెంబ్లీ పోరు ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పంజాబ్‌ పీఠం గెలిచేదెవరన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పంజాబ్‌ కుర్చీ కోసం ఈసారి బహుముఖ పోటీ తప్పడం లేదు.


ఇక్కడ అధికార కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంత సవ్యంగా లేదు. ఇప్పటికే వరుసగా పంజాబ్‌లో రెండు సార్లు గెలిచింది. ఇప్పుడు గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది.. కానీ అలాంటి సీన్ కనిపించడంల లేదు. నిన్న మొన్నటి వరకూ సీఎంగా పని చేసిన కెప్టెన్ అమరీందర్‌ సింగ్.. తనను సీఎంగా తప్పించడంతో  ఏకంగా పార్టీ నుంచి వెళ్లిపోయి.. సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఈయనతో ఇప్పుడు బీజేపీ పొత్తు కట్టింది.


ఇక ఇప్పుడు అందరి దృష్టీ ఆకర్షిస్తోంది కేజ్రీవాల్ ఆప్ పార్టీ.. ఢిల్లీలో పాగా వేసినప్పటి నుంచే కేజ్రీవాల్ పక్కనే ఉన్న పంజాబ్‌పైనా దృష్టి సారించారు. అయితే.. గత ఎన్నికల్లో గెలవలేకపోయినా 20 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. అయితే వీరిలో చాలామంది ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. దాని ఫలితంగానే తాజాగా పంజాబ్‌ రాజధాని ఛండీగడ్‌ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ పార్టీ అది పెద్ద పార్టీగా అవతరించింది.


దీనికి తోడు ఇప్పుడు బీజేపీ అమరీందర్‌ సింగ్‌తో కలసి పొత్తుగా బరిలో దిగుతోంది. కాంగ్రెస్ ఒంటరి పోరునే నమ్ముకుంది. ఇక నిన్న మొన్నటి వరకూ బీజేపీతో పొత్తుకట్టిన శిరోమణి అకాలీదల్ ఇప్పుడు బీఎస్పీతో పొత్తుతో బరిలో దిగుతోంది. ఇలా బహుముఖ పోరు జరుగుతుండటంతో కేజ్రీవాల్‌ పార్టీకి అది సానుకూల అంశంగా మారింది. కేజ్రీవాల్ నాయకత్వంలో దిల్లీలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు పంజాబ్‌లోనూ అమలు కావాలంటే ఆప్‌నే గెలిపించాలని కేజ్రీవాల్ పిలుపు ఇస్తున్నారు. మరి ఈసారి కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లో జెండా ఎగరేస్తారా.. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి దిల్లీ వెలుపల పంజాబ్‌లోనే అధికారం కైవసం చేసుకుంటుందా.. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: