ప్రభుత్వ పథకాలకు ప్రజానాయకుల పేర్లు పెట్టడం కొత్తేమీ కాదు.. ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం, పేదల కోసం, సేవ కోసం.. సమాజ అభివృద్ధి కోసం.. తమ జీవితాలను పణంగా పెట్టిన పెద్దలను తలచుకునేందుకు ఇలా ప్రభుత్వ పథకాలకు వారి పేర్లుపెట్టి స్మరించుకుంటాం.. వారి పేరు పెట్టుకున్నందుకైనా ఆ పథకాలను సక్రమంగా అమలు చేస్తామని ఆశిస్తాం. అయితే.. రాను రాను ప్రభుత్వ పథకాలకు ప్రజానేతల పేర్లు పెట్టే ట్రెండ్‌ మరీ పక్కదారి పడుతోంది.


గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. తమ పార్టీకి చెందిన ప్రముఖుల పేర్లను పథకాలకు పెట్టడం బాగా అలావాటైపోయింది. దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ అలవాటు ప్రారంభించిందని చెప్పొచ్చు. అప్పట్లో ప్రతి పథకానికి నెహ్రూ, ఇందిరా పేర్లు పెట్టడం ప్రారంభం అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ నాయకుల పేర్ల వ్యవహారాన్ని దివంగత సీఎం వైఎస్సార్‌ పీక్స్‌కు తీసుకెళ్లారు. ఆయన తన హాయాంలో ప్రతి పథకానికి అయితే ఇందిరా పేరో.. లేకుండా రాజీవ్‌ పేరో పెట్టేవారు.


ఇక ఆ తర్వాత చంద్రబాబు కూడా ఇదే ధోరణి ప్రదర్శించారు.. ఆయన ఎన్టీఆర్ పేరుతో పథకాలు పెట్టారు. ఆ తర్వాత వాళ్ల పేర్లు, వీళ్ల పేర్లు ఎందుకు అని ఏకంగా చంద్రబాబు తన పేరుతోనే పథకాలు ప్రారంభించారు. చంద్రన్న కానుక, చంద్రన్న పింఛన్‌.. ఇలా చంద్రబాబు తన పేరుతో పథకాలు ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఈ ట్రెండ్‌ను వైఎస్‌ జగన్ పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. జగన్ అయితే.. ఇక తగ్గేదే..లే అనుకుంటూ ఇప్పుడు ప్రతి పథకానికీ నేరుగా తన పేరే పెట్టేసుకుంటున్నారు.


జగనన్న విద్యాకానుక, జగనన్నకాలనీలు, జగనన్న స్మార్ట్ టౌన్లు.. ఇలా ప్రతి దానికీ జగనన్న అంటూ తగిలించేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఏదో చేసినా ఒకటి, రెండు పథకాలకే తన పేరు పెట్టారు. జగన్ మాత్రం.. ప్రతి పథకానికీ తన పేరే పెట్టుకుంటున్నారు. ఇంతగా పథకాలకు సొంత పేర్లు పెట్టుకున్న నేత చరిత్రలో మరొకరు లేరు. ఈయన పెట్టిన పథకాలు.. మళ్లీ కొత్త సర్కారు వస్తే ఎలాగూ తీసేస్తుంది. అయినా సరే.. తాను అధికారంలో ఉన్నంత వరకూ తన పేరే వినిపించాలని జగన్ అనుకుంటున్నారేమో కానీ.. ఇది మరీ అతి అయిపోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: