వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్య‌వ‌హారం మ‌ళ్లీ ఢిల్లీకి చేరింది. శుక్ర‌వారం దేశ రాజ‌ధానిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీ లోని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. త‌న‌ను హ‌త్య చేయ‌డానికి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కొంద‌రు కిరాయి హంత‌కుల‌తో కుట్ర జ‌రుగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనికి సంబంధించిన అన్ని వివ‌రాల‌తో ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించి న‌ర‌సాపురం ఎంపీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. నిజానికి గురువారం నుంచి ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఏపీ సీఐడీ అధికారులు హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ నివాసానికి చేరుకుని పాత కేసుల‌కు సంబంధించి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు ఇవ్వ‌డంతో ఎంపీకి షాక్ త‌గిలింది. సంక్రాంతి పండుగ‌ను సొంత జిల్లాలో సంప్ర‌దాయంగా బంధుమిత్రుల మధ్య జ‌రుపుకోవ‌డం ఆయ‌న‌కు ఆన‌వాయితీ. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆయ‌న సొంత పార్టీ అధినాయ‌క‌త్వం తో విభేదించి, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం, ఆ తరువాత అరెస్టు కావ‌డం త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌తో కొంత‌కాలంగా నియోజ‌క‌వ‌ర్గానికి రాలేక‌పోయిన విష‌యం తెలిసిందే.

ఇక సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన త‌రువాత ఎంపీ త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకుని తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. అంత‌కుముందు త‌న‌ను సీఐడి విచార‌ణ పేరుతో ఏపీకి పిలిపించడం వెనుక కుట్ర దాగి ఉంద‌ని విమ‌ర్శిస్తూనే, అయినా తాను విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని ఆయ‌న మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే..విచార‌ణ‌కు హాజ‌రైన స‌మ‌యంలో త‌న‌పై పార్టీ అభిమానుల పేరుతో కొంత‌మంది సామూహికంగా దాడి చేసి హ‌త్య చేసేందుకు ప‌థ‌కం ప‌న్నారని ఎంపీకి తెలిసింద‌ని అందుకే ఆయ‌న ఢిల్లీ వెళ్లిపోయారని ఎంపీ స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా మీడియాకు లీకులిచ్చారు. ఇక శుక్ర‌వారం ఢిల్లీ నుంచి ఆయ‌న ఇదే అంశంపై మ‌రింత స్ప‌ష్ట‌మైన ఆరోప‌ణ‌ల‌కు దిగారు. గుంటూరు జిల్లాలో ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ను అధికార పార్టీ నేత‌లు హ‌త‌మార్చిన విష‌యాన్ని కూడా ఇదే సంద‌ర్బంగా ఆయ‌న‌ ప్ర‌స్తావించారు.


చిరంజీవికి వైసీపీ రాజ్య‌స‌భ అవ‌కాశం ఇస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌పై మాట్లాడుతూ చిరంజీవి ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకే వైసీపీ ప్ర‌భుత్వం ఈ ప్ర‌చారం చేస్తోంద‌ని కూడా ఆరోపించారు. అంతేకాదు.. జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కం కూడా ఏపీలో ఇక‌పై కొన‌సాగ‌ద‌ని, తాను చేసిన ఫిర్యాదుపై కేంద్ర‌మంత్రి స్పందించార‌ని కూడా ఎంపీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేనా లేక రాజ‌కీయంగా సానుభూతి కోసం చేస్తున్నారా అనే చ‌ర్చ మొద‌లైంది. ఎందుకంటే ఎంపీ ర‌ఘురామ‌రాజు ప్ర‌స్తుతం కేంద్రం క‌ల్పించే వై కేట‌గిరీ భ‌ద్ర‌త మ‌ధ్య ఉన్నారు. ఆయ‌న‌పై హ‌త్యా ప్ర‌య‌త్నం చేయ‌డ‌మంటే వైసీపీ ప్ర‌భుత్వానికి అది ఆత్మ‌హ‌త్యా స‌దృశ‌మే అవుతుంది. గ‌తంలో ఆయ‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ఉప‌యోగించార‌న్న కేసులో ప్రభుత్వం ఇప్ప‌టికే డిఫెన్స్‌లో ఉంది. మ‌రిప్పుడు మ‌ళ్లీ ఇలా జ‌రిగే అవ‌కాశం ఉందా అంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మేన‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి మ‌రి ర‌ఘురామరాజు ఆరోప‌ణ‌ల వెనుక ఏముందో ప్ర‌ధానికి ఆయ‌న రాసే లేఖ‌లోనైనా స్ప‌ష్ట‌మ‌వుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: