ఏపీ సీఎం దగ్గర ఏదైనా మాయా మర్మం ఉన్నాయా.. లేక వశీకరణ విద్య ఏమైనా జగన్ నేర్చుకున్నారా అన్న అనుమానం ఇటీవల వస్తోంది. ఎందుకంటే.. ఆయన ఏపీ ఉద్యోగుల పీఆర్సీ సమస్యను దాదాపు నెల రోజులకుపైగా నానబెట్టి.. చివరకు.. తాను అనుకున్న 23 శాతం ఫిట్‌మెంట్‌కే ఉద్యోగ సంఘాలను ఆయన తెలివిగా వప్పించారు. అబ్బే.. ఫిట్‌మెంట్‌ 43 శాతం మించి ఉండాల్సిందే అన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. అంతేకాదు.. అసలు ఫిట్‌మెంట్‌ అన్నది ఐఆర్‌ కంటే ఎన్నడూ తక్కువగా చరిత్రలోనే లేదు.


అలాంటిది ఉద్యోగ సంఘాల నాయకులను జగన్ కేవలం 23 శాతం ఫిట్‌మెంట్‌కు ఒప్పించారు. అయితే.. ఒకటి కోల్పోయేవాళ్లకు మరొకదాంట్లో అయినా సరే.. మేలు చేయాలి అన్న సూత్రం ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకుని దాన్ని ఉద్యోగ సంఘాల చర్చల సమయంలో అస్త్రంగా ప్రయోగించారు. ఈ పాచిక అద్భుతంగా పారింది. ఉద్యోగ సంఘాలు కూడా ప్రధానంగా  ఈ డిమాండ్ దగ్గరే బోల్తా పడ్డాయి.


ఎందుకంటే.. ఈ ఒక్క పదవీవిరమణ వయస్సు పెంపు వంటి నిర్ణయంతోనే ఒక్కో ఉద్యోగికి దాదాపు 40 లక్షల వరకూ లబ్ది కలుగుతుందని అంచనా. దీంతో ఉద్యోగ సంఘనేతలు ఫిట్‌మెంట్ అంశంలో రాజీ పడిపోయారు. అయితే.. అంతవరకూ బాగానే ఉంది. మరి జగన్ చెప్పిన ప్రతిపాదనలకు తాము ఓకే చెప్పే సమయంలో .. తమ ఉద్యోగులను ఎలా సముదాయించుకోవాలన్న ఆలోచన కూడా చేయాలి కదా.


కానీ ఉద్యోగ సంఘాల నేతలు అవేమీ చేసినట్టు కనిపించడం లేదు. ఉద్యోగులు కాస్త నిలదీయగానే.. అవును.. నిజమే.. మేం తక్కువ ఫిట్‌ మెంట్ కు ఒప్పుకున్నాం.. కానీ ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఇంతగా ఫిట్‌మెంట్‌ గురించి ఆలోచించే నేతలను ఆరోజు చర్చల్లో సీఎం జగన్ ఏం మాయచేశారో.. ఎలా ఒప్పించారన్నది ఇప్పుడు అందరిలోనూ సందేహాలు రేపుతున్న ప్రశ్న. సమాధానం కావాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: