దేశ రాజ‌కీయాల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రం ఎప్పుడూ కీల‌క‌మే. ఆ మాట‌కొస్తే ఇప్ప‌టిదాకా దేశానికి ప్ర‌ధానులుగా ప‌నిచేసిన‌వారిలో ఎక్కువ‌మంది ఆ రాష్ట్రానికి చెందిన‌వారే. 2017 లో స‌మాజ్‌వాది పార్టీపై అఖండ విజ‌యం సాధించి బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. యోగీ ఆదిత్య‌నాథ్ ఆ పార్టీ త‌ర‌పున‌ ముఖ్య‌మంత్రి పీఠం అధిష్ఠించిన కొత్త‌లో ఆయ‌న పాలన అవినీతి ర‌హితంగా, అద్భుతంగా ఉంద‌ని, ఇక మోదీ త‌రువాత ప్ర‌ధాని పీఠం ద‌క్కేది కూడా ఆయ‌న‌కేన‌ని భారీ స్థాయిలో ప్ర‌చారం కూడా సాగిపోయింది. క‌ట్ చేస్తే మూడేళ్లు గ‌డిచేస‌రికి యోగి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో పెరిగిన అసంతృప్తిని అధిగ‌మించేందుకు ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి పీఠం నుంచి దించేందు కేంద్రంలోని పార్టీ పెద్ద‌లు శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. యోగి ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీసి ఆయ‌న‌ను కేంద్ర‌రాజ‌కీయాల్లోకి రాకుండా అడ్డుకోవ‌డానికి కొంద‌రు పార్టీ పెద్ద‌లు కుటిల‌య‌త్నాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు యోగి వ‌ర్గం ఎదురుదాడి కూడా చేసింది. అయితే ఈ వివాదంలో అంతిమంగా బీజేపీ మాతృ సంస్థ‌ ఆర్ఎస్ఎస్‌లో యోగికి ఉన్న ప‌లుకుబ‌డితో ఆయ‌న‌తో ఢిల్లీ పెద్ద‌లు రాజీ ప‌డ‌క త‌ప్ప‌లేద‌న్న విశ్లేష‌ణ‌లున్నాయి.
             

             యూపీలో ప్ర‌స్తుతం మ‌రోసారి పార్టీల‌న్నీ ఎన్నికల ర‌ణ‌రంగం ముందు నిలుచుని ఉన్నాయి. పార్టీల త‌ల‌రాత‌ల‌ను ప్ర‌జ‌లు నిర్ణ‌యించబోతున్నారు. తాజా స‌ర్వేల‌ను చూస్తుంటే బీజేపీకి స‌మాజ్‌వాది పార్టీకి హోరాహోరీ పోరు జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీ నుంచి ప్ర‌మ‌ఖ నేత‌లు ఒకరొక‌రిగా వ‌ల‌స బాట ప‌ట్ట‌డం చూస్తే బీజేపీ గెలుపు అవ‌కాశాల‌పై ఆ పార్టీ నేత‌ల్లోనే అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డిందా అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. నిన్న‌మొన్న‌టిదాకా ఆ రాష్ట్రంలో త‌మ‌కు ఎదురే లేద‌ని భావించిన బీజేపీకి ఈ ప‌రిస్థితి ఎందుకు వచ్చింది..?  దీనికి చాల కార‌ణాలున్నాయి. కేవ‌లం హిందుత్వ రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై, యూపీ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించే కుల స‌మీక‌ర‌ణ‌ల‌ను యోగి ఆదిత్య‌నాథ్ విస్మ‌రించ‌డం కూడా వీటిలో ఒక‌టి. యూపీలో సంఖ్యాప‌రంగా యాద‌వ కుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. ముస్లింలు కూడా వంద‌కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం చూప‌గ‌ల స్థాయిలో ఉన్నారు. వీరితోపాటుగా కుర్మీ, మౌర్య‌, కుశ్వాహా, సైనీ త‌దిత‌ర బీసీ వ‌ర్గాలూ చెప్పుకోద‌గిన సంఖ్య‌లో ఉన్నారు. వీరిలో అధికశాతం మంది మ‌ద్ద‌తు పొంద‌గ‌ల‌గ‌డంతోనే గ‌తంలో ములాయం సింగ్ యాద‌వ్‌, ఆ త‌రువాత కాలంలో ఆయ‌న త‌న‌యుడు అఖిలేష్ ముఖ్య‌మంత్రులు కాగ‌లిగారు.    
                   

              అయితే అఖిలేష్ ముఖ్య‌మంత్రి అయ్యాక యాద‌వేత‌ర బీసీల‌ను నిర్ల‌క్ష్యం చేశార‌న్న కార‌ణంగానే వారిలో చాలామంది బీజేపీ వైపున‌కు మ‌ర‌లార‌న్న అంచ‌నాలున్నాయి. అగ్ర‌కుల క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఇదే పొర‌పాటు చేశారు. హిందుత్వ ఛ‌త్రం కింద‌కు ఒక‌సారి వ‌చ్చిన‌వారు ఇక చెదిరిపోయే అవ‌కాశం లేద‌ని భావించారు. అ అంచనాలు తిర‌గ‌బ‌డ్డాయి. దీనికి తోడు కోవిడ్ స‌మ‌యంలో స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై ఒత్తిడి పెంచాయి. ఇదే స‌మ‌యంలో అఖిలేష్ యాద‌వ్ చురుగ్గా పావులు క‌దిపారు. గ‌తంలో బీఎస్పీ ప్రాభ‌వం పెర‌గ‌డంలోను, ఆ త‌రువాత బీజేపీ గెలుపులోనూ త‌నవంతు పోషించిన బ‌ల‌మైన బీసీ నేత‌ స్వామిప్ర‌సాద్ మౌర్య‌ను, మ‌రికొంద‌రు నేత‌ల‌ను త‌న పార్టీలోకి చేర్చుకోవ‌డం ద్వారా వారికి తాను ప్రాధాన్యం ఇవ్వ‌బోతున్న‌ట్టు బ‌ల‌మైన సంకేతాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపారు.  మ‌రోప‌క్క రైతుల పోరాటంపై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఆ వ‌ర్గాల్లో నెల‌కొన్న తీవ్ర వ్య‌తిరేక‌త‌ను గుర్తించి రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌తో కూడా అఖిలేష్ పార్టీ ఎస్పీ పొత్తు కుదుర్చుకుంది. మాజీ ప్ర‌ధాని చౌధురీ చ‌ర‌ణ్‌సింగ్ మ‌న‌వ‌డు, గ‌తంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన అజిత్ సింగ్ కుమారుడు జ‌యంత్‌ చౌధురి నేతృత్వంలో ప‌ని చేస్తున్న ఈ పార్టీకి జాట్ వ‌ర్గంలో చెప్పుకోద‌గిన బ‌ల‌ముంది. మొత్తంమీద కేంద్రంలో అధికార పార్టీగా త‌న‌కున్న శ‌క్తియుక్తుల‌న్నింటినీ వినియోగించి యూపీలో గెలిచితీరాల‌న్న సంక‌ల్పంతో ఉన్న బీజేపీని అంతే స‌మ‌ర్థంగా నిలువ‌రించేందుకు ఇటు అఖిలేష్ కూడా స‌ర్వ‌స‌న్న‌ద్ధంగానే ఉండ‌టంతో యూపీ రాజ‌కీయం అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: